శ్రీశైలం సొరంగం ఎందుకు పూర్తి చేయలేదు..! – భట్టి విక్రమార్క

శ్రీశైలం సొరంగం ఎందుకు పూర్తి చేయలేదు..! – భట్టి విక్రమార్క

కనగల్ , మన సాక్షి:

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే శ్రీశైలం సొరంగం ఎందుకు పూర్తి చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం నల్లగొండ నియోజక వర్గంలోని కనగల్ మండలం చేరుకుంది. బట్టి విక్రమార్క పాదయాత్రకు మండల కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కనగల్ మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి భట్టి విక్రమార్క నివాళులర్పించారు.

 

అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో నల్లగొండ జిల్లాకు కేసిఆర్ ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు. ఆనాడు రైతులకు సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్ ఎల్ బి సి ని అభివృద్ధి చేసి లిప్టులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. శ్రీశైలం సొరంగంతోపాటు నక్కల గండి, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ పక్షపాత ధోరణి అవలంబించారని ధ్వజమెత్తారు.

 

ఎస్ ఎల్ బి సి టన్నెల్ పూర్తి కాకపోవడంతో గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలు రాకుండా చేసిన కెసిఆర్ నల్లగొండ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రాజెక్టుల గురించి అడిగితే నా పంచె గోచి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదు నెలల తర్వాత ప్రజల దీవెనలతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దొరల ప్రభుత్వానికి పాత రేస్తామన్నారు.

 

ALSO READ : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

దశాబ్ద కాలంగా తెలంగాణకు పట్టిన పీడ విరగడ చేసేందుకు పీపుల్స్ మార్చ్ కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ నిదర్శనం అన్నారు. నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఆస్తులు పెరిగాయే తప్ప తెలంగాణ ఆకాంక్షల కోసం ఉద్యమాలు చేసిన ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీ మాది అన్నారు. తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

 

సబ్బండ వర్గాల ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. రింగు రోడ్ల పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని, తమ భూములు లాక్కోవద్దని అడ్డు చెప్పిన రైతులకు సంకెళ్లు వేసి జైలు పాలు చేస్తున్నారన్నారు. రైతులు ఏమన్నా ఉగ్రవాదులా, తీవ్రవాదులా, పాకిస్తాన్ టెర్రరిస్టులా అని ప్రశ్నించారు.

 

 

also read : GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశానవాటికులకు దళితుల, బలహీన వర్గాలకు ఇచ్చిన భూములను లాక్కోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యారెంటీ టైటిల్ డీడ్ తో అర్హులందరికీ పట్టాలిస్తామన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలోనే ఇప్పటికీ పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అటకెక్కాయా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

 

ప్రజలు ఆలోచించాలని, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంట గ్యాస్ సిలిండర్ ను రూ. 500 కే ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ నిధులను రూ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతామన్నారు.

 

సొంత భూమిలో 2 గదుల ఇంటి నిర్మాణం చేసుకుంటే రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతుల రుణమాఫీ రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు పై బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను ఉచితంగా అందిస్తామన్నారు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చకిలం శ్రీనివాసరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి ఇలా ఎందరో ఉద్దండులు ఉన్నారన్నారు.

 

సభానంతరం బట్టి పాదయాత్ర మండలంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ బిక్షం యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, నాయకులు పరమేష్, వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, యాదయ్య, నాగరాజు, మండల కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం ప్రెసిడెంట్ రాజు రెడ్డి, శ్రీను, యాదగిరి రెడ్డి, జగతయ్య, సత్తయ్య, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.