పోలీస్ వాహనంపై రాళ్లదాడి.. ముగ్గురిపై కేసు నమోదు, ఒకరి అరెస్ట్..!
మౌలాలి భరత్‌నగర్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురిపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీస్ వాహనంపై రాళ్లదాడి.. ముగ్గురిపై కేసు నమోదు, ఒకరి అరెస్ట్..!
మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి :
మౌలాలి భరత్‌నగర్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురిపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై జె. గణేష్ బాబు ఘటన వివరాల గురించి మాట్లాడుతూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఆర్పీసీ-13339 కే. సాయి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు. శనివారం రాత్రి 7:15 గంటల ప్రాంతంలో మౌలాలి ప్రాంతంలో బీసీ డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో, భరత్‌నగర్ పెద్దమ్మతల్లి గుడి వద్ద గొడవ జరుగుతోందని పెట్రోల్ మొబైల్ సిబ్బంది నుంచి సమాచారం అందింది.
వెంటనే సాయికిరణ్, ఎస్పీవో సురేష్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు మరికొందరితో కలిసి స్థానికులతో గొడవపడుతూ అలజడి సృష్టిస్తున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా. మౌలాలికి,భరత్‌నగర్ చెందిన పెలిమరి శివకుమార్ (36), కూలీ, అతనితో పాటు శ్రావణ్, మరికొందరు పోలీసుల విధులకు అడ్డు తగిలారు.
ఈ క్రమంలో పోలీసులపైకి కావాలనే గాయపరచాలని, హత్య చేయాలనే ఉద్దేశంతో రాళ్లు రువ్వారు. దీంతో ఫిర్యాదుదారుడు సాయికిరణ్ కుడి చేతికి దెబ్బ తగిలి రక్తం కారింది. అంతేకాకుండా టీఎస్ 09 పి ఏ 3528 నంబరు గల పెట్రోల్ మొబైల్ వాహనం ముందు అద్దం, ఒక పోలీస్ ల ట్యాబ్‌ను ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై శనివారం రాత్రి 9:00 గంటలకు ఫిర్యాదు అందుకొని నిందితులు శివకుమార్, శ్రావణ్, మరికొందరిపై క్రైమ్ నంబర్ 494/2026, సెక్షన్లు 110, 132, 324(4), రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నిందితుడిలో ఒకరు పెలిమరి శ్రావణ్ కుమార్‌ను ఆదివారం అరెస్టు చేసాము, కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై జె. గణేష్ బాబు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.









