సమైక్య ఆంధ్ర కన్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం

సమైక్య ఆంధ్ర కన్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం

మందమర్రి, డిసెంబర్ 16 మన సాక్షి: సమైక్యాంధ్ర రాష్ట్రంలో కన్నా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ విద్యార్థి యువజన పోరు యాత్ర శుక్రవారం మందమర్రి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మందమర్రి పాత బస్టాండ్ లో బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు, యాత్రకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సామాజిక న్యాయ సాధన, విద్య, ఉపాధి కోసమే బీసీ విద్యార్థి యువజన పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2నుండి పోరు యాత్ర పాలమూరు నుండి మొదలుకొని పట్నం వరకు, 33 జిల్లాలు 80 నియోజకవర్గాల్లో 36 రోజులపాటు కొనసాగుతుందని, నేటికీ యాత్ర ప్రారంభమై 13 రోజులు కాగా యాత్ర నేడు మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చేరుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించిన బీసీ విద్యార్థుల జీవితాలు, భవిష్యత్తుకై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 3257 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ర్యాంకులతో నిమిత్తం లేకుండా,10వేల లోపు ర్యాంకు నిబంధన ఎత్తివేసి, ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ రకాల ఫీజులు పెంచుతూ, వివిధ రకాల నిబంధనలతో సబ్బండ వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే దురాలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఊరురా మద్యం దుకాణాలు తెరిచారని, ప్రతి 100మందికి బెల్ట్ షాపు, వెయ్యి మందికి వైన్ షాపు, 3వేల మందికి బార్లు ఏర్పాటు చేస్తూ, బంగారు తెలంగాణ అంటే బడులు మూసుడు, బరులు తెరుచుడు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. స్వరాష్ట్రంలో 4750 పాఠశాలలు మూసివేశారని, మన ఊరి మనబడి కార్యక్రమంలో ఒక పాఠశాలను సైతం నూతనంగా నిర్మించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో మద్యం ఏరులై పారుతుందని, మద్యం మత్తులో రాష్ట్ర యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 45 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం పాలనా కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి వంద మందికి పాఠశాల, వెయ్యి మందికి కళాశాల, 3వేల మందికి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే పోరాటం చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని, అందరికీ సమానమైన విద్య, అందరికీ వైద్యం అందించాలని, చదువుకున్న యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచెర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణిమంజరి, మందమర్రి పట్టణ అధ్యక్షులు కొండిల్ల శ్రీనివాస్, మందమర్రి పట్టణ నాయకులు రవి వాల్మీకి, రాయబారపు కిరణ్, కుర్రె శ్రీనివాస్, ఎండి జమాల్, ఎం సంపత్, జమాల్ పురి నర్సోజి, రెడ్డి రాకేష్, ఎదులపురం రాజు,
రామసాని సుధీర్, రవి, సాయి సింగతి రంగనాథ్, బి శివ, అరుణ్, వేణు, పరిపూర్ణ చారి, విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.