Runamafi : రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేషన్ కార్డులు లేకున్నా మాఫీ.. ఎప్పటి వరకో చెప్పిన తుమ్మల..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేషన్ కార్డులు లేకున్నా మాఫీ.. ఎప్పటి వరకో చెప్పిన తుమ్మల..!
నల్లగొండ, మన సాక్షి :
అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందుంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా బుధవారం అయన నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన నిడమనూరు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో దారితప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగానే రైతులకు 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడం జరిగిందని, ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేసామని, దీపావళి లోపు తెల్ల కార్డులు లేని నాలుగు లక్షల మంది రైతులకు వారి ఖాతాలలో 2 లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు.
2 లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేస్తామని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తమ ప్రభుత్వం ఒకే పంట కాలంలో పెద్ద మొత్తంలో 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నేల్ ద్వారా జిల్లా అంతటికి సాగు నీరు అందిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో రైతుబంధు, పంటల బీమా, రైతు భరోసా ఇస్తామని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలను పెద్ద ఎత్తున సాగు చేయాలని, ఈ సంవత్సరం రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు వేశారని, 10 లక్షల ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసే అవకాశం ఉందన్నారు.
ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు సాగుచేసి రైతులు లాభాలు పొందవచ్చని, అంతేకాక ప్రభుత్వము ఆయిల్ పామ్ తోటలకు ఎకరాకు 50 వేల రూపాయల సబ్సిడీ సైతం అందిస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్ లో దేశంలోనే ముందుండాలని మంత్రి ఆకాంక్షించారు. దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు పండించేందుకు అవకాశం ఉందని, రైతులందరూ ఆయిల్ పామ్ తోటలు వేసుకొని లబ్ధి పొందాలని కోరారు.
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులకు సేవ చేసే అవకాశం, రైతులకు అలాగే ప్రభుత్వానికి వారధిగా పనిచేసే అవకాశం మార్కెట్ కమిటీలకు ఉంటుందని అన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ కి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో కులమతాలకతీతంగా ఇంటెగ్రేటెడ్ హాస్టల్లను నిర్మిస్తున్నామని ,7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ ప్రతి నెల మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని అన్నారు.
70 కోట్ల రూపాయలతో ముకుందాపురం- ఆల్వాల్ రోడ్డుకు వచ్చే వారంలో టెండర్లు పిలవనున్నామని , నల్గొండ జిల్లాకు ఆర్ అండ్ బి శాఖ ద్వారా 516 కోట్లు రోడ్లకు కేటాయించామని, గతంలో రహదారులను రెన్యువల్ చేసిన పాపాన పోలేదని ,తామ వచ్చిన తర్వాత అన్ని రోడ్లను రెన్యువల్ చేస్తున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం ఎస్ఎల్బిసిని 10 సంవత్సరాలు ఆపిందనితాము వచ్చిన తర్వాత తిరిగి ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టినట్టు వెల్లడించారు.నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే సేవ చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అన్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు రావడం, అదేవిధంగా నూతన వ్యవసాయమార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. జిల్లా కలెక్టర్ సి . నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతులు బాగున్నప్పుడే అందరు బాగుంటారని, అలాంటి రైతు సంక్షేమం కోసం మార్కెట్ కమిటీలు పనిచేయడం సంతోషమని అన్నారు.
నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీకీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారుకార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మెరుగైన సేవ లు అందించాలని ఆకాంక్షించారు.
నిడమనూరు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంపటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బుసిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలందిస్తామని అన్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొనగా, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయదేవి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ,వైస్ చైర్మన్, డైరెక్టర్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
MOST READ :









