Miryalaguda : బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి..!

Miryalaguda : బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి గొంతు కోయడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద బీసీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను నమ్మించి నిట్ట నిలువునా మోసం చేసి గ్రామీణ ప్రాంత ఎన్నికలు నిర్వహించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కి కట్టుబడకుండా నమ్మించి మోసం చేసి ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గించి బీసీలను అణిచివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ఎంతోమంది ఈ రిజర్వేషన్లను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అన్నారు. పేద వర్గాలని అణిచివేస్తే భవిష్యత్తులో నీకు మీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు అన్నారు.
రాహుల్ గాంధీ చెప్పిన మాటను మీరు తుంగలో తొక్కి సిగ్గు లేకుండా ఇతర రాష్ట్రాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికలను తక్షణమే నిలిపివేసి చట్టబద్ధంగా బీసీలకు రావలసిన 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు పగిడి జీడయ్య యాదవ్, సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా నాగేశ్వరరావు విద్యార్థి సంఘం జిల్లా నాయకులు, కుర్రోపిడిత సురేష్, యువజన సంఘం నాయకులు ఉపేందర్, వెంకటేష్, నారాయణ, ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









