District collector : పదేళ్ల తర్వాత మారుమూల గిరిజన ప్రాంతమైన పొగిళ్లను సందర్శించిన జిల్లా కలెక్టర్..!
నల్గొండ జిల్లా, చందంపేట మండలం,పొగిళ్ల ,కంబాలపల్లిల లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అధికారులతో కలిసి పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాలను సందర్శించారు.

District collector : పదేళ్ల తర్వాత మారుమూల గిరిజన ప్రాంతమైన పొగిళ్లను సందర్శించిన జిల్లా కలెక్టర్..!
-
చందంపేట మండలం, పొగిళ్ల, కంబాలపల్లి భూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు.
-
ఏప్రిల్ 15 నుండి పొగిళ్ల భూముల సర్వేకు ప్రత్యేక సర్వే బృందాల ఏర్పాటు -జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.
నల్లగొండ, మన సాక్షి
నల్గొండ జిల్లా, చందంపేట మండలం,పొగిళ్ల ,కంబాలపల్లిల లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అధికారులతో కలిసి 10 సంవత్సరాల తర్వాత పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాలను జిల్లా కలెక్టర్ ఆయా గ్రామాలను సందర్శించారు.
ముందుగా గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్లు , గ్రామ సమస్యలను గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాల ను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. వంటగదిని ,పాఠశాలలో సౌకర్యాలు ,మధ్యాహ్న భోజనం, తదితర వివరాలను పరిశీలించడమే కాకుండా, తనిఖీ చేశారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల తరగతిగదితోపాటు, తాగునీరు,కిచెన్ ఇతర పనులన్నింటిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీతో తీర్మానం చేయించి అంచనాలు పంపించి పనులు చేపట్టి పూర్తి చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఎలా చదువుతున్నారని? విద్యార్థులను ప్రశ్నించడమే కాకుండా, యూనిఫామ్ వేసుకోవాలని చెప్పి విద్యార్థులతో తెలుగు శతకాలు ,పద్యాలు చదివించారు. విద్యార్థులు మధ్యలో బడిమాని వేయకుండా చూడాలని, ఉపాధ్యాయులు రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో గ్రామస్థులతో మాట్లాడారు.
గ్రామంలో ఉన్న భూ సమస్యల విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతూ పొగిళ్ల గ్రామంలో సర్వేనెంబర్ 2 లో సుమారు.1056 ఎకరాలు ఉందని, గతంలో డిఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగిందని, 2023 లో ఎల్ ఆర్ యు పి అమలు సందర్భంగా కొంతమంది రైతుల భూములకు పట్టాలు రాలేదని, కొంతమంది రైతులకు ఎక్కువ భూమి రికార్డు కావడం, కొంతమందికి రికార్డు కాకపోవడం జరిగాయని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, కంబాలపల్లి లో ఇదే విషయమై మోకా సర్వే నిర్వహించడం జరుగుతున్నదని, అక్కడ సర్వే పూర్తయిన తర్వాత ఏప్రిల్ 15 నుండి పొగిళ్లలో భూముల సర్వే తో పాటు, మోక సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులు సర్వేకు సహకరించాలని, ప్రస్తుతం ఉన్న పట్టాలు, రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి, మోకాపై ఉన్న రైతుల జాబితాను గ్రామం పంచాయతీ నోటీస్ బోర్డులో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం, వాటిని పరిష్కరించి, పూర్తి విచారణ నిర్వహించి భూ భారతి ద్వారా అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకోగా కంబాలపల్లి నుండి పొగిళ్ల వరకు ఆర్ అండ్ బి రహదారి మరమ్మతులు చేయించాలని ,సబ్ స్టేషన్ మంజూరు అయిందని వెంటనే పనులు మొదలుపెట్టాలని, గ్రామ సమాఖ్య భవనం మంజూరు కాగా, వివాదాల కారణంగా నిలిచిపోయిందని, అలాగే పట్టాలతో పాటు, ఫారెస్ట్ భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకుగాను ప్రభుత్వం అమలు చేసే పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని, సెరికల్చర్ ,టెంట్ హౌస్, కిరాణా తదితర చిన్న చిన్న వ్యాపారులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వము బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేస్తుందని, అంతేకాక శిక్షణ ఇస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. తక్షణమే గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని చేపట్టాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. పిల్లలతో అంగన్వాడి కేంద్రం ద్వారా ఇస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి టీచర్ తో విద్యార్థులకు బోధించే కథలు, ఆట,పాటలు, అన్నింటిని అడగడమే కాకుండా పిల్లల కు పెట్టే భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నందున తక్షణమే ఫ్యాను, లైట్లు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.
ఆ తర్వాత పల్లె దవ ఖానాను సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ రెగ్యులర్గా పల్లె దవఖానను సందర్శించాలని ఆదేశించారు. ప్రస్తుతం నర్సు వైద్య సేవలు అందిస్తున్నదని, రోగం తీవ్రతను బట్టి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం, లేదా ఆస్పత్రికి పంపించాలని ఆదేశించారు. గ్రామంలో పరిశుభ్రత ఉండేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్ జటావత్ జయేందర్ ను, కార్యదర్శి రవిని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం, కంబాలపల్లి సర్పంచ్ గోవిందు నివసిస్తున్న రేకుల వలయం తండాను సందర్శించి అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయుడు రావడం లేదని తెలుసుకొని తక్షణమే ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.అనంతరం కంబాలపల్లి రైతు వేదికలో రైతులు, గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను తెలియజేయాలని కోరగా సర్వేనెంబర్ 50, 37, ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని, గడచిన పది సంవత్సరాల నుండి తమ భూములకు పట్టాలు లేవని, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
గువ్వలకుంట లో టీచర్ను నియమించాలని, తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్ బుక్కులు జారీ చేసేందుకు కంబాలపల్లి లో సర్వే నంబర్ 50లో మోకా సర్వే పూర్తి చేయడం జరిగిందని , మంగళవారం నుండి 37 సర్వేనెంబర్ లో ప్రారంభిస్తున్నామని, ఇందుకు రైతులు పూర్తిగా సహకరించాలని, అనంతరం ఒకటి నుండి 49 సర్వే నంబర్లలో ఉన్న సమస్యలను సైతం పరిష్కరిస్తామని, ఉన్నభూమి కన్నా ఎక్కువ రికార్డు అయినందున సమస్యలు వచ్చాయని, సర్వే పూర్తయిన తర్వాత మోకాపై ఉన్న వారి వివరాలన్ని ఆధారం చేసుకుని భూభారతి ద్వారా పట్టాలిస్తామని తెలిపారు.
ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను తీర్చేందుకు ఇందిర జల ప్రభ కింద బోర్లు, సోలార్ విద్యుత్ వంటివి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో నెలకొన్న ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించి జాయింట్ సర్వే నిర్వహించాలని తహసిల్దార్ శ్రీధర్ బాబును ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం, తాగునీరు కిచెన్ షెడ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మీటింగ్ లో తీర్మానం చేసి అంచనాలు రూపొందించి పంపించాలని ,నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి ,జిల్లా అధికారులు డిపిఓ శంకర్ నాయక్ ,డి ఈ ఓ బిక్షపతి, జిల్లా సంక్షేమ అధికారి.కృష్ణవేణి, ఆర్డబ్ల్యూఎస్ ,ట్రాన్స్కో, మైనింగ్ తదితర శాఖ అధికారులు ,చందంపేట తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, తదితర అధికారులతో పాటు ,పొగిళ్ల, కంబాలపల్లి సర్పంచులు తదితరులు ఉన్నారు.












