TG News : యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిల్..!
రేవంత్ సర్కార్ అమల్లోకి తెచ్చిన యూరియా యాప్ ను రైతు ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసినట్లు తెలిపారు.

TG News : యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిల్..!
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన సాక్షి, మిర్యాలగూడ :
రేవంత్ సర్కార్ అమల్లోకి తెచ్చిన యూరియా యాప్ ను రైతు ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసినట్లు తెలిపారు. చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరో నలుగురు రైతులు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ తో కూడిన ధర్మాసనం గురువారం విచారం చేపట్టింది. ఈ మేరకు 2 వారాల్లో సమగ్ర కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీజే తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టులో పిటిషనర్స్ తరఫున పాశం రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు యూరియా యాప్ ద్వారా రైతులు యూరియా సప్లయి చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.రైతుల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులు.
వీరిలో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు. కొద్ది మంది వద్ద స్మార్ట్ ఫోన్ ఉన్నా యూరియా యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఫోన్లో యాప్ ద్వారా బుక్ చేసుకొనే పరిజ్ఞానం లేదు. దీనివల్ల రైతులంతా వ్యవసాయ అధికారులపై, ప్రయివేట్ నెట్ సెంటర్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఉన్నది.యూరియా యాప్ ద్వారా యూరియా బస్తాలు బుక్ చేయించుకోవాలంటే ఇతర సంస్థలపై రైతులు ఆధారపడి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది.
అంతేగాకుండా రైతులంతా వారి వ్యవసాయ పనులను వదిలిపెట్టి యూరియా బస్తాల కోసం క్యూ లైన్లలో నిలుచోవాల్సిన దుస్థితి నెలకొంది. యూరియా కోసం రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఎకరానికి కనీసం ఒక బస్తా ఒకేసారి వేయాల్సిన అవసరముంది.
10 ఎకరాలు ఉన్న రైతుకు యాప్ ద్వారా బుక్ అయినట్లయితే 7 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల మిగతా 3 ఎకరాలకు బస్తాలు దొరకడం లేదు.15 రోజుల తరువాత మిగతా బస్తాల కోసం యూరియా యాప్ ద్వారా బస్తాల కోసం బుక్ చేసుకున్నా ఒక బస్తా కూడా ఇవ్వడం లేదు. రెండో విడతగా కూడా యూరియా వేయాల్సిన అవసరం ఉన్నది.
15 రోజుల కాలవ్యవధి తర్వాత కూడా 5 -6 బస్తాలు కూడా దొరకని దుస్థితి ఉన్నది. ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడానికి కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెకన్లలో స్టాక్ మాయమవుతున్నది. అంతేగాకుండా కౌలు రైతులకు ఓటీపి చేప్పే లోపే స్టాక్ యమవుతున్నది.
కౌలు రైతులు యూరియా బస్తాలు పొందాలంటే రైతుల పాసు పుస్తకాలు సమర్పించాల్సి ఉంటుంది.అసైన్ ల్యాండ్ ఉన్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులంతా యూరియా యాప్ ను ఎత్తి వేయాల్సిందిగా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ యాప్ ఇలాగే కొనసాగినట్టయిటే రైతులు బ్లాక్ మార్కెట్స్ బాట పట్టాల్సిన రోజులు ఇలాగే కొనసాగుతాయి.రైతులు యూరియాను సక్రమంగా వేయకపోయినట్టయితే పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది.
రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెంట అంగోతు హాతీరాం నాయక్, మట్టపల్లి సైదులు, వేణుగోపాల్ రావు, పులి జగదీష్, హమీద్ షేక్ తదితరులు పాల్గొన్నారు.









