Karimnagar : కరీంనగర్‌లో సిటీ బస్సు సేవలు షురూ.. రూట్లు ఇవీ..!
కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి స్థానిక డా. బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు.

Karimnagar : కరీంనగర్‌లో సిటీ బస్సు సేవలు షురూ.. రూట్లు ఇవీ..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి స్థానిక డా. బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మరియు ఇతర ముఖ్య నేతలు, అధికారులతో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో స్వయంగా ప్రయాణించారు.
నగరంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న ఈ సిటీ బస్సులను ప్రారంభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా, మొదటి దశలో కరీంనగర్- వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్ – చింతకుంట, మరియు కరీంనగర్- కొత్తపల్లి హవేలీ అనే మూడు ముఖ్యమైన రూట్లలో ఈ సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ బస్సులు విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు మరియు మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల ప్రజలకు, అలాగే విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సర్వీసులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీలు ఉండే ప్రతిమ, చల్మడ, మరియు మానకొండూరు వైపు కూడా బస్సులు నడుపుతామని ప్రకటించారు.
ప్రయాణికులు ఈ సేవలను ఆదరిస్తే 24 గంటలు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తూ, నగర ప్రజలంతా సిటీ బస్సులను వాడుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారని మంత్రి వివరించారు.
ఆర్టీసీ బలోపేతం కోసం కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు చేపట్టడంతో పాటు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలను కూడా తీర్చామని చెప్పారు. ప్రతి గ్రామానికి బస్సు చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం ఆర్టీసీ ప్రతి రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 65 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.










