Suryapet : సూర్యాపేట జిల్లా యర్కారంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు.. మాజీ సర్పంచ్ భర్త హత్య..!
సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైయ్యారు.

Suryapet : సూర్యాపేట జిల్లా యర్కారంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు.. మాజీ సర్పంచ్ భర్త హత్య..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైయ్యారు. నిన్న ఉదయం 10 గంటలకు సూర్యాపేటలో తన నివాసం నుండి పని నిమిత్తం బయటకు వెళ్లిన మధు సాయంత్రం నుండి ఫోన్లో సైతం అందుబాటులో లేకుండా పోయాడు. రాత్రి 10 గంటలకు మధు హత్యకు గురయ్యాడని ప్రచారం జరగగా అర్ధరాత్రి 1.30 గంటలకు యర్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలువలో హత్య చేసిన మధు మృతదేహన్నీ పోలీసులు గుర్తించి మృతదేహాన్ని హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
యర్కారం గ్రామం ఫాక్షన్ పరంగా సున్నితమైన గ్రామం కావడంతో గ్రామంలో పోలీసులు పికెట్ పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడు మధు మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు కావడంతో రవీందర్ వర్గీయులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు .
జరిగిన మధు హత్య వరకు సుమారుగా ఎనిమిది మంది రాజకీయ కక్షలు బలైయ్యారు . 1985 లో యలగందుల సిద్దయ్య హత్య తరవాత కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్య అనంతరం 1996 సిద్దయ్య కుమారుడు అజయ్ హత్యకు గురైయ్యాడు అప్పటి నుండి గ్రామం నీవురుగప్పిన నిప్పులా మారింది. అజయ హత్య జరిగిన కొద్దీ రోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ పై హత్యా యత్నం జరిగింది.
ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేషే కారణమని భావించి 1999లో రమేష్ ని హత్య చేశారు . రమేష్ హత్య అనంతరం కొంత కాలం ప్రశాంతంగా ఉన్న గ్రామం తిరిగి 2007లో మిద్దె రవీందర్ హత్యతో భగ్గుమంది . రవీందర్ హత్యతో పోలీసులు గ్రామం పై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో మరో ఘటన జరగకుండా అన్ని వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సమన్వయం చేశారు .
కొద్దీ రోజులపాటు పోలీసుల చర్యలు ఫలితాల ఇచ్చి గ్రామం ప్రశాంతంగా మారింది . ఇంతలోనే 2020 లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నని గ్రామంలో దారుణంగా హత్య చేశాడు ప్రత్యర్థి వడ్డే ఎల్లయ్య అయితే 2024 ఎల్లయ్యని జగ్గయ్యపేట సమీపంలో అతని ప్రత్యర్థి శ్రీకాంతా చారి హత్య చేశాడు. చింతలపాటి మధు 25 ఏళ్ళ క్రితం జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు తాజా ఘటన రవీందర్ వర్గీయులు చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
వరుస హత్య ఘటనలతో గ్రామం మాత్రం అట్టుడికిపోతుంది , గ్రామం పెరు చెబితేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని కుటుంబాలు రాజకీయ కారణాలతో నలిగిపోయి గ్రామం వదిలి వెళ్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా గ్రామం పై ప్రత్యేక దృష్టి పెట్టి మునుముందు ఎలాంటి ఘటనలు, హత్యలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.









