అధికారుల నిర్లక్ష్యం.. వాహనదారులకు శాపం..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ఆర్ అండ్ బి శాఖ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వాహనదారులకు శాపంగా మారింది. సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై గడ్డిపల్లి గ్రామం సమీపంలో భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. వాహనదారులకు శాపం..!
గరిడేపల్లి, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ఆర్ అండ్ బి శాఖ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వాహనదారులకు శాపంగా మారింది. సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై గడ్డిపల్లి గ్రామం సమీపంలో భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ గుంతల కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ ఇప్పటికీ స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పలుమార్లు ఈ సమస్యపై వార్తలు ప్రచురితమైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బుధవారం గడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న భారీ గుంతలో ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ కూరుకు పోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మంత్రి పర్యటన ఉంటేనే రోడ్డు గుర్తొస్తుందా?
మండలంలో లేదా గడ్డిపల్లి గ్రామంలో మంత్రి పర్యటన ఉన్నప్పుడు మాత్రమే అధికారులు, కాంట్రాక్టర్ హడావుడిగా గుంతల్లో కంకర పోసి తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. మంత్రి పర్యటన ముగిసిన తర్వాత మాత్రం రహదారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, సామాన్య ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గడ్డిపల్లి వద్ద దెబ్బతిన్న రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.









