వెలిగల్లు డ్యామ్ వద్ద తల్లీ, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం భగ్నం..!
అన్నమయ్య జిల్లా సమయస్ఫూర్తితో వ్యవహరించి మూడు నిండు ప్రాణాలను కాపాడిన గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డిని మరియు ఆయన సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ప్రత్యేకంగా అభినందించారు.

వెలిగల్లు డ్యామ్ వద్ద తల్లీ, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం భగ్నం..!
క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన గాలివీడు పోలీసులు
మదనపల్లి, మనసాక్షి
అన్నమయ్య జిల్లా సమయస్ఫూర్తితో వ్యవహరించి మూడు నిండు ప్రాణాలను కాపాడిన గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డిని మరియు ఆయన సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ప్రత్యేకంగా అభినందించారు.
శనివారం రాత్రి సుమారు 7:15 గంటల సమయంలో గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉండగా ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా, తలుపుల మండలానికి చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆందోళనతో ఫోన్ చేసి.. కుటుంబ కలహాల కారణంగా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాలివీడు మండలంలోని వెలిగల్లు డ్యామ్ వద్ద ఆత్మహత్య చేసుకోబోతోందని, దయచేసి వెంటనే వెళ్లి వారిని కాపాడాలని వేడుకున్నాడు.
సమాచారం అందుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించిన ఎస్ఐ నరసింహారెడ్డి గారు, తన సిబ్బందితో కలిసి హుటాహుటిన వెలిగల్లు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆత్మహత్యకు సిద్ధమైన ఆ మహిళను, ఆమె పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలను గుర్తించి అత్యంత చాకచక్యంగా వారిని అడ్డుకుని సురక్షితంగా రక్షించారు.
అనంతరం ఆ మహిళను విచారించగా, భర్తతో ఉన్న మనస్పర్థల కారణంగానే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. వెంటనే పోలీసులు ఆ మహిళ బంధువులకు సమాచారం అందించి వారిని స్టేషన్కు పిలిపించారు.
క్షణికావేశంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, సమస్యలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సదరు మహిళకు మరియు వారి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆమెను, పిల్లలను బంధువుల సమక్షంలో సురక్షితంగా వారికి అప్పగించారు.
ఎస్పీ దీరజ్ కునుబిల్లి ప్రశంసలు:
ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడంలో ఒక క్షణం కూడా వృధా చేయకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన గాలివీడు ఎస్ఐని, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజల ప్రాణ, మాన, రక్షణలో అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.









