Breaking : ఆర్మూర్ లో ఘోర ప్రమాదం.. చికెన్, కిరాణా షాపుల్లో మంటలు..!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాశీ హనుమాన్ గల్లీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒకే ప్రాంగణంలో ఉన్న చికెన్ షాప్, కిరాణా దుకాణానికి మంటలు అంటుకున్నాయి.

Breaking : ఆర్మూర్ లో ఘోర ప్రమాదం.. చికెన్, కిరాణా షాపుల్లో మంటలు..!
ఆర్మూర్, మనసాక్షి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాశీ హనుమాన్ గల్లీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒకే ప్రాంగణంలో ఉన్న చికెన్ షాప్, కిరాణా దుకాణానికి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో దుకాణ యజమానులైన తల్లి, కొడుకులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
కాశీ హనుమాన్ గల్లీకి చెందిన తల్లి, కొడుకులు ఒకే చోట చికెన్ సెంటర్ తో పాటు కిరాణా షాపును కూడా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం దుకాణం తెరిచి, చికెన్ ను కాలుస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ పైపు లీకైంది. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి షాప్ మొత్తం అంటుకున్నాయి.
దుకాణంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, లోపల ఉన్న సామాగ్రిని, షాపును కాపాడుకునే క్రమంలో లోపలే ఉన్న తల్లి, కొడుకు ఇద్దరికీ తీవ్రమైన అగ్ని గాయాలయ్యాయి.
మంటల తీవ్రతను తట్టుకుంటూనే స్థానికులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం గాయపడిన తల్లి, కొడుకులను వెంటనే చికిత్స నిమిత్తం ఆర్మూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే స్థానికులు మంటలను కొంతవరకు అదుపు చేయగా, ఫైర్ సిబ్బంది మిగతా మంటలను పూర్తిగా ఆర్పివేసి ప్రమాదం మరింత పెరగకుండా అదుపు చేశారు. ఆదివారం ఉదయాన్నే ఈ ప్రమాదం జరగడంతో కాశీ హనుమాన్ గల్లీ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.









