Miryalaguda : మిర్యాలగూడలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం..!
పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం..!
మిర్యాలగూడ, మనసాక్షి :
పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
శనివారం ఆయన మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని బంగారుగడ్డ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు, నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, 1500 ఇండ్లకు డిసెంబర్ 9న భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల పరిమితిని 10 లక్షలు చేయడం జరిగిందని, ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టితో ఆలోచించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇదివరకే వివిధ రకాల జీవిత బీమా పథకాలు ఉన్నప్పటికీ ఈ పథకం వర్తిస్తుందని, అందువల్ల మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ పథకం కింద నమోదు కావాలని, ఇందుకు అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబం నమోదు కావాలని, 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉండి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నమోదు చేసుకోవచ్చని, రేషన్ కార్డు లేని వారికి తర్వాత నమోదు చేయడం జరుగుతుందని, ఈ పథకంలో భాగంగా కుటుంబంలో ఆర్జించే వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇస్తుందని ,ఈ పథకం కింద నమోదు చేసుకునేందుకు కుటుంబం లో ఆర్జించే వ్యక్తి ఆయి ఉండాలని, అలాగే నామినిని ప్రతిపాదించాలని, కుటుంబంలోని అందరి సమ్మతితో బీమా దారు, నామిని వివరాలు, మొబైల్ ఫోన్ నెంబర్ వివరాల తో గ్రామపంచాయతీ లేదామున్సిపల్ వార్డులో ఏర్పాటు చేసే కౌంటర్లలో నమోదు చేయించాలని, ఇందుకోసం కౌంటర్ల వద్దకు వస్తే రెండు నిమిషాలలో నమోదును పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
రేషన్ కార్డు ఆధారంగా ముందే వివరాలు కలిగిన ఫామ్స్ ఉంటాయని, దరఖాస్తు చేసుకున్న వారికి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుందని, గతంలో ఎలాంటి బీమా ఉన్నప్పటికీ ఈ బీమా వర్తిస్తుందని , ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు అయితే పెన్షన్లు రద్దు కావని, ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చని, అంతేకాక రేషన్ కార్డు ఆధార్ చిరునామాలలో మార్పులు ఉన్నట్లయితే దరఖాస్తుదారు కోరుకున్న చోటే చిరునామా నమోదు చేయడం జరుగుతుందని, రేషన్ కార్డు లేని వారికి కూడా తర్వాత ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, ఆర్డీవో రమణ రెడ్డి, కౌన్సిలర్లు మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.









