BREAKING : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ చీఫ్ గుర్రు.. షోకాజ్ నోటీసులా? సస్పెన్షనా..?
మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

BREAKING : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ చీఫ్ గుర్రు.. షోకాజ్ నోటీసులా? సస్పెన్షనా..?
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏఐసీసీకి మహేశ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు, వీడియో క్లిప్పింగులతో హైకమాండ్‌కు నివేదిక
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు పార్టీ అధిష్టానం దృష్టికి చేరాయి. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ చీఫ్.. ఈ అంశంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను సైతం పార్టీ హైకమాండ్‌కు పంపించినట్లు సమాచారం.
పార్టీకి ఇబ్బందికరంగా పదేపదే వ్యాఖ్యలు
రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై గతంలోనూ ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ పార్టీ పెద్దలు సంయమనం పాటిస్తూ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అయితే, ఈసారి ముఖ్యమంత్రిని నేరుగా లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది.
హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా? లేక మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఒకవేళ చర్యలు తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారు? అన్న అంశాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. పార్టీ క్రమశిక్షణ అంశంగా మారుతుందా? లేక మరోసారి సర్దుబాటుతో ముగుస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.









