Nalgonda : చిన్న వివాదం.. దారుణహత్య.. కట్ చేస్తే కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి డబుల్ జీవిత ఖైదు..!
చిన్నపాటి వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది.

Nalgonda : చిన్న వివాదం.. దారుణహత్య.. కట్ చేస్తే కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి డబుల్ జీవిత ఖైదు..!
నల్లగొండ, మన సాక్షి:
చిన్నపాటి వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నల్లగొండ జిల్లా పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తు, సీసీ కెమెరా ఫుటేజీతో సహా పటిష్టమైన సాక్ష్యాధారాలు నిందితుడికి శిక్ష పడటంలో కీలకంగా మారాయి. హత్య నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కూడా నేరం రుజువు కావడంతో నిందితుడికి రెండు జీవిత ఖైదులు, మొత్తం రూ.10 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం (నవంబర్ 20, 2026) సంచలన తీర్పు వెలువరించింది.
చిన్న వివాదం.. బండరాయితో దారుణ హత్య
కేసు వివరాల ప్రకారం.. 2025 ఆగస్టు 27వ తేదీ రాత్రి సుమారు 11:30 గంటలకు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీవీకే రోడ్డులో ప్రతీక్ రెడ్డి మెమోరియ ల్ బాయ్స్ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (40), కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన షేక్ సిరాజ్ అలియాస్ సిల్లు (40) మధ్య రాత్రి నిద్రించే స్థలం విషయంలో చిన్నపాటి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సిరాజ్, రమేష్ తలపై బండరాయితో బలంగా కొట్టి హత్య చేశాడు.
సీసీ కెమెరాలే కీలక సాక్ష్యం :
ఆగస్టు 28వ తేదీ ఉదయం ఘటన గురించి తెలుసుకున్న మృతుడి బావ బుషిపాక వెంకటయ్య నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీఐ ఎ. రాజశేఖర్ రెడ్డి క్రైమ్ నంబర్ 238/2025గా బీఎన్ఎస్ సెక్షన్ 103(1), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ 3(2)(va) కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా ఘటనా స్థల పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో నిందితుడు దాడి చేసిన దృశ్యాలు కీలక ఆధారాలుగా మారాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, సాక్షుల వాంగ్మూలాలను సేకరించి నిందితుడిపై నేరాన్ని నిరూపించేలా పటిష్టమైన కేసును సిద్ధం చేశారు.
రెండు సెక్షన్ల కింద రెండు జీవిత ఖైదులు :
నల్లగొండ సెషన్స్ కేసు నంబర్ 138/2026లో విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం, రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి 2026 నవంబర్ 20న తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు షేక్ సిరాజ్ అలియాస్ సిల్లు (40)కు బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ 3(2)(va) కింద మరో జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించారు. ఈ జరిమానా చెల్లించకపోతే అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని తీర్పులో పేర్కొన్నారు. రెండు జీవిత ఖైదు శిక్షలు ఏకకాలంలో అమలు కావా లని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో నిందితుడికి డబుల్ జీవిత ఖైదుతో పాటు మొత్తం రూ.10 వేల జరిమానా ఖరారైంది.
దర్యాప్తు బృందానికి ఎస్పీ అభినందనలు
ఈ కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించిన నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి, అప్పటి వన్‌టౌన్ సీఐ ఎ. రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ జె. సైదులును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అభినందించారు. అలాగే కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ -1 ఎస్. శోభారాణి, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు నరేం దర్, మల్లికార్జున్ల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించా రు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్ష తప్పదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు శిక్షలు పడేలా కోర్టులో పటిష్టమైన సాక్ష్యా ధారాలు సమర్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు.









