Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

బోర్డు చెడిపి.. దళితుల భూముల అక్రమణకు బడాబాబుల కన్ను..!

రాజేంద్రనగర్ నియోజకవర్గం, గండిపేట మండలం నార్సింగి పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై భూబకాసురుల కన్ను పడింది.

బోర్డు చెడిపి.. దళితుల భూముల అక్రమణకు బడాబాబుల కన్ను..!

1981లో ఇందిరాగాంధీ హాయంలో కేటాయించిన స్థలం ఆక్రమణకు యత్నం

ప్రభుత్వ హెచ్చరిక బోర్డుపై రంగులు పూసి, అక్షరాలు చెరిపివేసిన అక్రమార్కులు.

రక్షణ కల్పించి, పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌కు బాధితుల వినతి.

రాజేంద్రనగర్, మనసాక్షి :

రాజేంద్రనగర్ నియోజకవర్గం, గండిపేట మండలం నార్సింగి పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై భూబకాసురుల కన్ను పడింది. గతంలో ఎస్సీ వర్గానికి చెందిన నిరుపేద లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడానికి కొందరు అక్రమార్కులు ప్రయత్నిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తమకు కేటాయించిన భూమిని కబ్జాదారుల నుండి కాపాడి, తమకు పూర్తి హక్కులు కల్పించేలా పట్టాలు మంజూరు చేయాలని బాధితులు సోమరవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి వినతి పత్రం అందించారు.

అనంతరం బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 1981వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నార్సింగి గ్రామానికి చెందిన 30 మంది పేద దళితులను గుర్తించి. వారి జీవనోపాధి నిమిత్తం సర్వే నంబర్ 298/P లోని 2 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిలో ఒక్కొక్కరికి 242 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించారు. అక్కడ కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వమే మూడు దఫాలుగా కోడి పిల్లలను పంపిణీ చేసింది.

అయితే, అప్పట్లో వచ్చిన తీవ్రమైన తెగుళ్ల కారణంగా 80 శాతం కోళ్లు మృతి చెందడంతో ఆ పథకం మధ్యలోనే నిలిచిపోయింది. అనంతరం ఆర్థిక స్తోమత లేకపోవడం, బ్యాంక్ రుణాలు తీర్చలేకపోవడంతో లబ్ధిదారులు తిరిగి ఆ వ్యాపారాన్ని ప్రారంభించలేకపోయారు. ఆ తర్వాత భూమి రక్షణ కోసం లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ అధికారులను సంప్రదించగా, వారి సలహా మేరకు సదరు స్థలంలో ఇట్టి సర్వే నెంబర్ లోని స్థలం ప్రభుత్వ స్థలం, ఇందులో ఎటువంటి క్రయ విక్రయాలు జరుపకూడదు” అని ఒక బోర్డును ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం నార్సింగి ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, కొంతమంది బడా వ్యాపారవేత్తలు, కబ్జాదారులు ఈ భూమిపై పడ్డారు. రెండు రోజుల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఆ ప్రభుత్వ బోర్డుపై తెల్ల రంగు వేసి, అక్షరాలను చెరిపివేశారు.

అంతేకాకుండా, ఆ స్థలంలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చిన భూమే మాకు ఆధారం. ఇప్పుడు ఇక్కడ గజం భూమి వేలల్లో పలుకుతుండటంతో అక్రమార్కులు మా స్థలాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి, కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.

మాకు ఆ స్థలంపై ‘పట్టాలు’ ఇచ్చి, మా భూమిని మాకు దక్కేలా చూడాలి.ఈ మేరకు బాధితులు నార్సింగి గ్రామ ఎస్సీ వర్గ లబ్ధిదారుల కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ భూమికి సంబంధించిన అన్ని రకాల పాత పత్రాలను అధికారులకు అందజేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. వినతి పత్రం అందించిన వారు దయాకర్, క్రాంతి, విశ్వనాథం, సుధీర్, విశాల్, కీర్తి, రాజ్ శేఖర్ తదితరులు.

మరిన్ని వార్తలు