మందమర్రిలో తీవ్రత కలకలం.. సారంగపల్లి అటవీ ప్రాంతంలో వ్యక్తి అస్తిపంజరం లభ్యం..!
మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపల్లి అటవీ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని పురుషుడి అస్థిపంజరం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మందమర్రిలో తీవ్రత కలకలం.. సారంగపల్లి అటవీ ప్రాంతంలో వ్యక్తి అస్తిపంజరం లభ్యం..!
మందమర్రి, మనసాక్షి :
మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపల్లి అటవీ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని పురుషుడి అస్థిపంజరం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సారంగపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి రేషవెన బాలయ్య అనే వ్యక్తి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన మేకలను మేపడానికి సారంగపల్లి అటవీ లోపలికి వెళ్ళాడు.
ఆ సమయంలో అడవిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి, అస్థిపంజరం రూపంలో పడి ఉండటాన్ని గమనించాడు భయంతో బాలయ్య వెంటనే ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలి రాములుకు సమాచారం అందించాడు.
సర్పంచ్ ద్వారా విషయం తెలుసుకున్న సారంగపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య, సర్పంచ్ మరియు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ కేవలం తల భాగం (పుర్రె), చేతులు, కాళ్ళ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్న అస్థిపంజరాన్ని గుర్తించారు.
మృతదేహం పక్కన లేత నీలం రంగు ప్యాంటు, దానికి బెల్టు ధరించి ఉందని మృతదేహంపై చర్మం, మాంసం ఏమీ లేకుండా పూర్తిగా అస్థిపంజరంగా మారిపోవడంతో, అడవి జంతువులు మృతదేహాన్ని తినివేసి ఉంటాయని భావిస్తున్నారు.
ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య మందమర్రి పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని, సదరు వ్యక్తి ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం లభించిన ప్రాంతాన్ని క్లూస్ టీమ్ మరియు ఉన్నతాధికారులు సందర్శించి ఆధారాలు సేకరిస్తున్నారు.









