Nalgonda : హృదయ విధారక ఘటన.. అతివేగం, నిర్లక్ష్యంతో ఎడ్ల బండిని ఢీ కొట్టిన కారు.. రెండు ఎడ్లు మృతి, రైతుకు గాయాలు..!
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న విషాద ఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Nalgonda : హృదయ విధారక ఘటన.. అతివేగం, నిర్లక్ష్యంతో ఎడ్ల బండిని ఢీ కొట్టిన కారు.. రెండు ఎడ్లు మృతి, రైతుకు గాయాలు..!
శాలిగౌరారం, మనసాక్షి:
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న విషాద ఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పెర్కకొండారం గ్రామానికి చెందిన కౌలు రైతు బండారు రామ్మూర్తి మంగళవారం ఉదయం తాను కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో పత్తి గింజలు నాటేందుకు ఎడ్లబండిపై బయలుదేరారు. తన సహచరికి కూలీలను తీసుకురమ్మని చెప్పి ముందుగా పొలం వైపు వెళ్తుండగా… కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి-365 పై విషాదం ఎదురుచూస్తోంది.
గ్రామం నుంచి వచ్చే సర్వీస్ రోడ్డును దాటి జాతీయ రహదారిపైకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే నకిరేకల్ నుంచి అర్వపల్లి వైపు వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు ఎడ్లబండిని బలంగా ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం, కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, నిద్రమత్తులో వాహనం నడిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఢీకొన్న ప్రభావానికి ఎడ్లబండి రోడ్డు పక్కకు ఎగిరిపడగా… రైతు రామ్మూర్తి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆయన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న రెండు కాడెద్దులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే స్పందించి రామ్మూర్తిని చికిత్స నిమిత్తం నల్లగొండ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతున్నట్లు సమాచారం.
ఈ ఘటనను చూసిన గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతు కళ్లముందే అతని జీవనాధారమైన కాడెద్దులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ సంఘటన పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శాలిగౌరారం ఎస్ ఐ సైదులు తెలిపారు.









