Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : యాప్ లో కాదు షాప్ లో ఎరువులు ఉండాలి..!

ఖరీఫ్ సీజన్లో రైతులందరికీ రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

Nalgonda : యాప్ లో కాదు షాప్ లో ఎరువులు ఉండాలి..!

నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :

ఖరీఫ్ సీజన్లో రైతులందరికీ రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ లోని దొడ్డి కొమరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం డబ్బికార్ మల్లేశం అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది.. రైతులకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎరువులను కొనుగోలు చేయాలంటే యాప్ ద్వారా వ్యవసాయం చేయడం సాధ్యం కాదన్నారు. అన్ని ఎరువుల దుకాణాల్లో యూరియా, డిఏపి విక్రయించే విధంగా ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ స్వల్పకాలిక రుణాలను బ్యాంకర్లు బుక్ అడ్జస్ట్మెంట్ కాకుండా పంటల స్కేల్ ప్రకారం రుణాలు ఇవ్వాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వ్యవసాయ రంగం, విద్య, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల అన్ని రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయకుండా సగానికి సగం మూసివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే అమలు జరుగుతే పేదలను చదువుకు దూరం చేయడమే అన్నారు. వర్షాకాల సీజన్ అన్ని ప్రభుత్వ వైద్యశాలలో తగిన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే అన్ని రకాల వైద్య సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ భూములలో పేదలు సాగు చేస్తున్న వారిపై అటవీ అధికారులు దాడులు చేయవద్దని కోరారు.

యుద్ధం వల్ల ఆయిల్ ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు పడ్డాయని ధరల పెరుగుదలతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ముడి చమురు ధరలు తగ్గిన తర్వాత ఐదారు సార్లు ధరలు పెంచిందని విమర్శించారు. ధరలు పెరగడం తో అన్ని వర్గాల ప్రజలపై భారాలు వేసిందని, ఈ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూల విధానాలను అవలంబిస్తూ ప్రజలపై మరింత దాడి పెంచిందని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులపై దాడులు చేస్తూ కార్పొరేట్లకు అనుకూలమైన లేబర్ కోడ్స్ ను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని, అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయడానికి ఈ ప్రభుత్వాలు కుటిలయత్నం చేస్తున్నాయని తెలిపారు. పని గంటల పెంపు, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులు, వేతనాలపై దాడి వంటి అంశాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగవంతం అవుతుందని, శాశ్వత ఉద్యోగాలు లేకుండా పోతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యాన్ని ప్రజలకు దూరం చేస్తూ కార్పొరేటర్ లాభం చేయడం కోసం వీటిని ప్రైవేటీకరిస్తుందని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని వాటి అమలు కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సిపిఎం సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పోరాటాలను సిపిఎం చెస్తుందని, సిపిఎం నిర్వహించే పోరాటాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ గత కార్యకలాపాలను సమీక్షించి భవిష్యత్ కర్తవ్యాలను వివరించారు. రాబోయే జూలై, ఆగస్టు నెలలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ కార్యకర్తలను చైతన్యపర్చడానికి జూలైలో పార్టీ అన్నీ స్థాయిల నాయకత్వానికి నియోజకవర్గస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సర్ కార్యక్రమంలో అన్ని గ్రామాలలో బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీ తరఫున పాల్గొనాలని కోరారు. ఈనెల 24న జిల్లా కేంద్రానికి వస్తున్న ముఖ్యమంత్రి జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రకటన చేసి, దానికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేశం, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు