Miryalaguda : సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న ర్యాపిడో డ్రైవర్లు.. చివరికి పోలీసులకు చిక్కారు ఇలా..!
మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Miryalaguda : సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న ర్యాపిడో డ్రైవర్లు.. చివరికి పోలీసులకు చిక్కారు ఇలా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం సిఐ సోమ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అజ్మీరా శశిధర్ నాయక్ (24) ధనావత్ కార్తీక్ (25)లు హైదరాబాద్‌లో రాపిడో రైడర్లుగా పనిచేస్తూ చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితులు ముందుగా హైదరాబాద్‌లో పార్క్ చేసి ఉన్న ఒక హోండా యాక్టివా స్కూటీని దొంగిలించి, దానిని చైన్ స్నాచింగ్‌లకు వినియోగించాలని ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో ఈ నెల 17 న మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్ ప్రాంతంలో ఇంటి ముందు పనిచేస్తున్న ఒక మహిళ మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని పరారయ్యారు. అనంతరం దొంగిలించిన బంగారు చైన్‌ను మిర్యాలగూడలోని మణప్పురం ఫైనాన్స్ లో తనఖా పెట్టి రూ.1,22,000 రుణం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ డబ్బును ఇద్దరూ పంచుకుని ఖర్చు చేసినట్లు ఒప్పుకున్నారు. బుధవారం ఉదయం మిర్యాలగూడ హనుమాన్‌పేట ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాలు, ఇతర వస్తువుల వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత అట్టి నేరస్తులను రిమాండ్ కు పంపించడమైనది.
ఈ కేసు ను జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణ మరియు ఆద్వర్యంలో ఛేదించినందున మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ సోమనర్సయ్య, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, సిబ్బంది స్వర్ణా నాయక్, మణిదీప్, సమద్ అహ్మద్, ప్రసాద్, అక్బర్ పాషా, రామకృష్ణ, రాజశేఖర్ మరియు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్ పి ప్రత్యేకంగా అబినందించడం జరిగిందని తెలిపారు.










