Hyderabad : జ్యువెలరీ షాపులో చోరీ.. 7 తులాల బంగారం..4 కిలోల వెండి అపహరణ..!
చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యువెలరీ షాపులో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.

Hyderabad : జ్యువెలరీ షాపులో చోరీ.. 7 తులాల బంగారం..4 కిలోల వెండి అపహరణ..!
శేరిలింగంపల్లి, మన సాక్షి
చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యువెలరీ షాపులో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నూకల శివశంకర్‌కు చెందిన బాలాజీ జ్యువెలరీ షాపులో శుక్రవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. షాపు వెనుక భాగంలోని తలుపుకు ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించిన దుండగులు.. రంధ్రాన్ని పెద్దది చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం వెనుక గది నుంచి ముందు గదికి వెళ్లే తలుపుకు రంధ్రం చేసి షాపులోని బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు.
ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సీహెచ్.వై. శ్రీనివాస్‌కుమార్తో పాటు సీసీఎస్, ఎస్‌వోటీ, చందానగర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.









