Suryapet : సూర్యాపేట జిల్లా వెల్దండలో ఘోరం.. విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని వెల్దండ గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

Suryapet : సూర్యాపేట జిల్లా వెల్దండలో ఘోరం.. విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి..!
గరిడేపల్లి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని వెల్దండ గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోదాటి సైదులు (45), తండ్రి వెంకన్న, కౌలుకు తీసుకున్న పొలంలో పచ్చిగడ్డి కోసేందుకు వెళ్లాడు.
పొలంలో గడ్డి కోస్తున్న సమయంలో విద్యుత్ మోటార్‌కు సంబంధించిన వైరు కొడవలికి తగిలి తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం ఏర్పడి సైదులుకు తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని విషాదంలో మునిగిపోయారు.
మృతుడి భార్య రమాదేవి (35) తెలిపిన వివరాల ప్రకారం.. సైదులు కౌలు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సైదులు అకస్మాత్తుగా మృతి చెందడంతో భార్య, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాదాన్ని నింపాయి.
పొలాల్లో విద్యుత్ మోటార్లకు సంబంధించిన వైర్లు, విద్యుత్ పరికరాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను వెంటనే సరిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.









