బాలానగర్ లో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి..!
ఆర్టీసీ బస్సు ఢీకొని మిషన్ భగీరథలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న యువకుడు మృతి చెందిన విషాద సంఘటన బాలానగర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

బాలానగర్ లో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి..!
మహబూబ్ నగర్ జిల్లా మన సాక్షి :
ఆర్టీసీ బస్సు ఢీకొని మిషన్ భగీరథలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న యువకుడు మృతి చెందిన విషాద సంఘటన బాలానగర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామం వీరన్న పల్లికి చెందిన అరవింద్ (25) కొంతకాలంగా మిషన్ భగీరథలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
మంగళవారం బైక్‌పై విధులకు వెళ్తుండగా షాద్‌నగర్ నుంచి నవాబుపేట వైపు వెళ్తున్న షాద్‌నగర్ డిపోకు చెందిన TG 07 Z 0032 ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు వేగంగా ఢీకొట్టడంతో బైక్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద తీవ్రతకు అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్సై నరేందర్‌రెడ్డి, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రమాదంలో మృతిచెందిన అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు
నెల క్రితమే పెళ్లి.. అంతలోనే మృత్యువు
అరవింద్‌కు నెల రోజుల క్రితమే వివాహం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పెళ్లయిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
చిన్న వయసులోనే అరవింద్ మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. అరవింద్ తండ్రి కూడా సుమారు 20 ఏళ్ల క్రితమే మృతి చెందినట్లు వారు తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న యువకుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడి సోదరుడు రాఘవేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోద దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.









