Nalgonda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిప్పిన ఒకే ఒక్క పదం.. హత్యకు పథకం ఎలా వేశారంటే..!
ఈ నెల 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సవాలుగా తీసుకుని వెంటనే దేవరకొండ డియస్పీ అద్వర్యంలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు.

Nalgonda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిప్పిన ఒకే ఒక్క పదం.. హత్యకు పథకం ఎలా వేశారంటే..!
పాఠాలు చెప్పిన టీచర్‌ను హతమార్చిన విద్యార్థులు..!
జిల్లాలో సంచలనం సృష్టించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీస్.
శాస్త్రీయ దర్యాప్తుతో కీలక ఆధారాలు, దోపిడీ కోసం దారుణ హత్య,సోషల్ మీడియాలో హత్యపై అన్వేషణా, ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అరెస్ట్ .
‘బాబు’అనే ఒకే ఒక్క మాటతో వీడిన హత్య మిస్టరీ .
రూ.1.54 లక్షల నగదు ,కత్తి, ఐఫోన్, సెల్ఫోన్లు స్వాధీనం.
జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్
మన సాక్షి,, నల్గొండ ప్రతినిధి:
ఈ నెల 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సవాలుగా తీసుకుని వెంటనే దేవరకొండ డియస్పీ అద్వర్యంలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆధునిక దర్యాప్తు పద్ధతులను ఉపయోగిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగించాలని ప్రత్యేక బృందాలకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్‌ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలు, పాత నేరస్తుల వివరాలు, అనుమానితుల కదలికలు, రౌడీషీటర్ల వెరిఫికేషన్ తదితర అంశాలను ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశంతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 30 కిలోమీటర్ల పరిధిని 360 డిగ్రీల కోణంలో పరిశీలిస్తూ, సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను ప్రతిరోజూ రాత్రి పగలు కష్టపడి విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్, ఇన్ఫర్మేషన్ టీమ్స్‌తో కలిపి మొత్తం 5 ప్రత్యేక బృందాల్లో సుమారు 40 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమించి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.
కేసును కీలక మలుపు తిప్పిన … ఒకే ఒక్క పదం!
హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో చివరిగా “బాబు” అని పలికారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో, “ఆమె చివరిగా బాబు అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు?” అనే ప్రశ్న పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కోణంలో విచారణ చేపట్టగా, రూపారెడ్డి తన పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా “బాబు” అని పిలిచేవారని పోలీసుల దృష్టికి వచ్చింది.
దీంతో దర్యాప్తు పాఠశాల విద్యార్థుల వైపు మళ్లింది. ప్రిన్సిపల్ మరణానికి సంతాప సూచకంగా పాఠశాలకు వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులను విచారించడంలో కొంత ఆలస్యం జరిగింది. పాఠశాల పునఃప్రారంభమైన అనంతరం పోలీసులు విద్యార్థులను ఒక్కొక్కరిని సున్నితంగా విచారిస్తూ దర్యాప్తును కొనసాగించారు.
ఈ క్రమంలో రెండు రోజులుగా పాఠశాలకు హాజరుకాని కొంతమంది విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారిలో అయిదుగురు విద్యార్థులు కొత్తగా జల్సాలకు అలవాటు ఐనా వారిపై ప్రత్యేక దృష్టి సాదించినారు. నేరస్థలం లో లభించిన సిసిటివి ఫూటేజ్ లు అనుమానిఠ విద్యార్థులతో సరిపోలడంతో వారిపై ప్రత్యేక దృష్టి సారించి నేరానికి పాల్పడినది సదరు విద్యార్దులే అని నిర్దారించుకొని
నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో పెండ్లిపాకల “X” రోడ్డు నుండి మల్లేపల్లి వస్తున్న్డగా దొనియాల X రోడ్ వద్ద బైక్‌పై వస్తున్న పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని సున్నితంగా విచారించి తనిఖీ చేయగా లోదుస్తుల్లో నగదు దాచుకున్నట్లు గుర్తించారు. అందులో సుమారు రూ.1.54 లక్షల నగదు, అలాగే స్వాదీన పరుచుకున్న మూడు 500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది.
నగదు ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా, ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు పాల్పడి నగదును అపహరించినట్టు వెల్లడించినారు.
అరెస్ట్ అయిన బాలుర వివరాలు :
1).JCL-1, వయస్సు: 16 సంవత్సరాలు, పదో తరగతి విద్యార్థి, (నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్) పుల్సింగ్ తండా, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా.
2). JCL-2,వయస్సు: 16 సంవత్సరాలు, పదో తరగతి విద్యార్థి, (నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్) పిల్యతండ, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా.
హత్యకు పథకం ఎలా రచించారు?
నిందితులు ఇద్దరూ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ పాఠశాల నందు 10 తరగతి చదువుతు హాస్టల్ నందు ఒకే గదిలో ఉంటున్నారు. వీరు జల్సాలు, చెడు వ్యసనలకు అలవాటుపడి హాస్టల్ గదులలో వారి తల్లి తండ్రులకు తెలియ కుండ సెల్ ఫోన్ లు వినియోగిస్తూ సోషల్ మీడియా , యూట్యూబ్ లలో డబ్బులు తేలికగా ఏలా సంపాదించాలి అని వెతుకెవారు. గతనెలలో వీరిద్దరు హాస్టల్ లో డబ్బులతో ప్రికిపాల్ కి దొరుకుతారు.
అట్టి విషయం లో ప్రిన్సిపల్ వారియొక్క తల్లి తండ్రుల సమక్షంలో మందలించగ ఇట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకుంటారు., ప్రిన్సిపల్ రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని భావించి సోషల్ మీడియాలో ఆదారాలు దొరకుండా హత్యపై అన్వేషనా చేసి హత్యకు పాల్పడి నగదును అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పథకంలో భాగంగా వీరిద్దరు గత వారం రోజులనుండి ప్రిన్సిపల్ రూపారెడ్డి ని అంతమొందించాలని సాంకేతికంగా దొరకాకుండా రెక్కి నిర్వహించి వారి ప్రణాళికలో భాగంగా మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి, బ్యాగులో నుంచి ఎరుపు రంగు హుడీ టీషర్ట్, ప్యాంట్ తీసుకుని వచ్చాడు.
అనంతరం కొండమల్లేపల్లిలో ఇద్దరు కలిసి కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని, ఎవరైనా వస్తున్నారా అని ఒకరు గమనిస్తుండగా మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. అప్పటికే తెరిచి ఉన్న వంటగది ద్వారా ఇంట్లోకి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం బెడ్రూమ్లో ఉన్న 2.50 లక్షల నగదును తీసుకుని ఇంటి వెనుక గోడ దూకి నిర్మానుష్య ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్‌ఫోన్‌ను చెట్ల పొదల్లో పడేశారు. కొంత దూరంలో బట్టలు మార్చుకుని, ఎరుపు రంగు హుడీని డ్రైనేజీలో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది.
స్వాధీనం చేసుకున్న వస్తువులు :
పోలీసులు నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ M.V. శ్రీనివాసరావు, మల్లెపల్లి సీఐ A. నవీన్ కుమార్, CCS ఇన్స్పెక్టర్ M. జితేందర్ రెడ్డి, మల్లెపల్లి ఎస్ఐ A. రమేష్, చింతపల్లి ఎస్ఐ M. రామ్మూర్తి, గుడిపల్లి ఎస్ఐ D. నరసింహులు, గుర్రంపొడు ఎస్ఐ N. వెంకన్న, CCS ఎస్ఐ U. సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు కరుణాకర్, విష్ణువర్ధనగిరి, వహీద్ పాషా, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, ప్రసాద్ రావు, ఫయాజ్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు హేము నాయక్, గులాం దస్తగిరి, సాయికుమార్, శివరాజ్, MD జునైద్ అహ్మద్, నరేష్, సాయి, K. కమల్ కిషోర్, వేణుగోపాల్ రెడ్డి, భాస్కర్, శరన్ రెడ్డి, నాగరాజు, అనిల్, హెచ్‌జీ శేఖర్‌లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులు ప్రకటించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మాట్లాడుతూ, కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని కూడా శాస్త్రీయంగా విశ్లేషిస్తూ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందాల కృషి అభినందనీయమని తెలిపారు. నేరం చేసిన వారు ఎంత తెలివిగా వ్యవహరించినా శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో దర్యాప్తు చేస్తే నేరాన్ని ఛేదించవచ్చని పేర్కొన్నారు.










