Miryalaguda : కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమం.. మిర్యాలగూడ సభలో కేటీఆర్ ప్రకటన..!

Miryalaguda : కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమం.. మిర్యాలగూడ సభలో కేటీఆర్ ప్రకటన..!
సెప్టెంబర్ 14 వరకు సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల షెడ్యూల్ ఇవ్వకుంటే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర
మిర్యాలగూడ, మన సాక్షి :
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నాగార్జునసాగర్ లో నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు ఇవ్వడంలేదని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి నీటిపారుదల శాఖ ఉన్నప్పటికీ రైతులకు నీరు అందించలేకపోతున్నారని అన్నారు. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోతే కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు ఇచ్చిన హామీలను ప్రొజెక్టర్ ద్వారా ప్లే చేసి సభలో అందరికీ చూపించారు. ఇచ్చిన హామీలలో అమలు చేయలేదన్నారు. రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతు కూడా 15 వేల రూపాయలు ఎకరానికి అందలేదన్నారు. రైతు కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా ఇవ్వలేదని, కౌలు రైతులకు రైతు భరోసా అందలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేయలేదన్నారు. కేసీఆర్ ఎప్పుడో చెప్పాడని ముసలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని బంద్ అయితాయని అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులను గోస పెట్టిస్తుందన్నారు.
సాగర్ ఎడమ కాలువ రైతులు సాగు నీటిని అడిగితే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు పెట్టాల్సి వస్తుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని ఇప్పుడు అలాగే వచ్చింది అన్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఏం చేయాలో నల్గొండ జిల్లా రైతులకు బాగా తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు.
మిర్యాలగూడలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి ఎన్ఎస్పి క్యాంపు బహిరంగ సభ స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టిఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్ధార్థ పర్యవేక్షణలో ర్యాలీ భారీగా సాగింది. సభకు మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ రాజ్యసభ బడుగుల లింగయ్య యాదవ్, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










