Karimnagar : కరీంనగర్ లో బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు..!
22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ధర్నా, వ్యవసాయ విధ్వంసంపై రైతు సదస్సులో విద్యార్థులను రాజకీయ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Karimnagar : కరీంనగర్ లో బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు..!
(నరేష్ – కరీంనగర్ బ్యూరో) మనసాక్షి :
22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ధర్నా, వ్యవసాయ విధ్వంసంపై రైతు సదస్సులో విద్యార్థులను రాజకీయ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల అకాడమీ లకు చెందిన కొందరు విద్యార్థులు పార్టీ కండువాలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థులు కళాశాలల్లో విద్యాభ్యాసంపై దృష్టి సారించాల్సిన సమయంలో రాజకీయ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు తరలించడంలో కళాశాల యాజమాన్యాల పాత్ర ఏమిటనే అంశంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు, సంబంధిత విద్యాసంస్థల పర్యవేక్షణ విభాగాలు స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారా? లేక కళాశాల యాజమాన్యాల ప్రోత్సాహం లేదా ఒత్తిడితో కార్యక్రమానికి హాజరయ్యారా? అనే అంశాలను అధికారులు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేలా విద్యాసంస్థలు రాజకీయ కార్యక్రమాల్లో వారిని వినియోగిస్తున్నట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
విద్యాసంస్థల్లో రాజకీయ ప్రభావం లేకుండా విద్యార్థుల విద్యా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు. అయితే, విద్యార్థులు పార్టీ కండువాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులపై విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.










