వీర్లపాలెంలో ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తత.. చట్ట విరుద్ధం.. ప్రజా సంఘాల ఆందోళన..!
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

వీర్లపాలెంలో ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తత.. చట్ట విరుద్ధం.. ప్రజా సంఘాల ఆందోళన..!
(దామరచర్ల, మన సాక్షి – దాసు)
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల అడ్డంకులు, అక్రమ నిర్బంధాల నడుమ ఈ ప్రక్రియ పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగిందని హై కోర్టు పిటిషనర్లు, స్థానికులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. శుక్రవారం జరిగిన ప్రక్రియను రద్దు చేసి, ప్రజాస్వామ్యబద్ధంగా మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
నవంబర్ 20న తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణపై స్టే ఇవ్వాలని కోరుతూ వీర్లపాలెం గ్రామానికి చెందిన రమావత్ వినోద్ కుమార్, నేనావత్ సిపాయి, కట్టెబోయిన నాగరాజు, రమావత్ వినోద్, గుంజ రమేష్, నక్క శ్రీనివాస్, ధీరివత్ శ్రీను నాయక్ లతో కూడిన ఏడుగురు పిటిషనర్లు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ( డబ్ల్యూ పి నెం . 39207 of 2026) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం (నవంబర్ 19) జస్టిస్ బి. విజయన్ రెడ్డి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూనే; పిటిషనర్లు నవంబర్ 12, 13 తేదీలలో సమర్పించిన అభ్యంతరాలను పర్యావరణ ప్రభావ అంచనా ( ఈ ఐ ఏ ) నోటిఫికేషన్ ( ఎస్. ఓ 1533(ఈ ), తేదీ: 14.09.2006) నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు పంపించి, చట్టప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి ( టీఎస్ పీసీబీ ) తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని నమోదు చేస్తూ ధర్మాసనం పిటిషన్ను పరిష్కరించింది.
పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం
క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను నమోదు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు పిటిషనర్లలకు ఆర్డిఓ అవకాశం కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కంపెనీ ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు స్థానికులను పోలీసులు ముందస్తుగా అక్రమంగా స్టేషన్లలో నిర్బంధించారని మండిపడ్డారు.
ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం లేకుండా, అక్రమ నిర్బంధాల మధ్య నిర్వహించిన ఈ సేకరణకు చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. అక్రమ నిర్బంధాలపై తక్షణమే విచారణ జరిపి, స్థానిక ప్రజలందరూ నిర్భయంగా పాల్గొనేలా మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని పిటిషనర్లు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి









