Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

ప్రతి నిరుద్యోగ పట్టభద్రుడికి నెలకు రూ.10 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలి..!

ప్రతి నిరుద్యోగ పట్టభద్రుడికి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.10 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐకేఎస్ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రతి నిరుద్యోగ పట్టభద్రుడికి నెలకు రూ.10 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలి..!

కనీసం మూడు సంవత్సరాల పాటు ఆర్థిక భరోసా కల్పించాలి

జూలకంటి రంగారెడ్డి

నల్గొండ, మన సాక్షి :

ప్రతి నిరుద్యోగ పట్టభద్రుడికి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.10 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐకేఎస్ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ గెలుపును కాంక్షిస్తూ ప్రజాసంఘాల సమన్వయ కమిటీ సమావేశం దొడ్డి కొమరయ్య భవన్ లో నారీ ఐలయ్య అధ్యక్షతన జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రభుత్వమిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో నుండి ప్రముఖ న్యాయవాది, మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ గారి ని గెలిపించాలని నల్లగొండ జిల్లా గ్రాడ్యుయేట్ ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉన్నత విద్యను అభ్యసించి పట్టభద్రులైనప్పటికీ సరైన ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అనేక హామీలు ఇస్తున్నప్పటికీ, ఆ హామీల అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. డిగ్రీలు, పీజీలు, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ పట్టభద్రులు తమ కుటుంబాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, కొంతమంది ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు తమ విద్యార్హతలకు సంబంధం లేని పనులు చేయాల్సి వస్తోందని అన్నారు.

ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగ పట్టభద్రుడికి ప్రభుత్వం నెలకు రూ.10,000 చొప్పున కనీసం మూడు సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో నిరుద్యోగ పట్టభద్రుడికి మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.3,60,000 ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.

నిరుద్యోగ భృతి అనేది ఉచితంగా ఇచ్చే ఆర్థిక సహాయం కాదని, విద్యను పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు ప్రభుత్వం కల్పించాల్సిన కనీస సామాజిక భద్రత అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందేందుకు, ఉద్యోగ అవకాశాలను అన్వేషించేందుకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం నిరుద్యోగ భృతితో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ గుర్తించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని, ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ప్రైవేటు రంగంలో కూడా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువతకు నాణ్యమైన విద్య అందించడం ఎంత ముఖ్యమో, విద్య పూర్తయిన తరువాత వారికి ఉపాధి కల్పించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. నిరుద్యోగ సమస్య కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది సమాజం, ఆర్థిక వ్యవస్థ, దేశ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశమని పేర్కొన్నారు.

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొల్లి సత్యనారాయణ ఎన్నికైతే నిరుద్యోగ యువత సమస్యలను శాసనమండలిలో బలంగా ప్రస్తావించి, ప్రతి నిరుద్యోగ పట్టభద్రుడికి నెలకు రూ.10 వేల చొప్పున మూడు సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేలా తన వంతు కృషి చేస్తారని జూలకంటి రంగారెడ్డి తెలిపారు.

ఈ ప్రజాసంఘాలు సమన్వయ కమిటీ సమావేశంలో ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి , తుమ్మల వీరారెడ్డి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నారి అయిలయ్య మల్లేశం, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాశం, మహ్మద్ సలీం, రాజశేఖర్ రెడ్డి, అక్కెనపల్లి మీనయ్య, వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, నరసింహ, సైదులు, శ్రీనివాస చారి, శంకర్, మల్లం మహేష్, నరేష్, ఎర్ర నాయక్, సీతారాములు ,నూకల జగదీష్ చంద్ర పందిరి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు