District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఈ నెల 10లోపు ఆ పనులు పూర్తి చేయాలి..!
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని మరమ్మతు పనులను జూన్ 10లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఈ నెల 10లోపు ఆ పనులు పూర్తి చేయాలి..!
నల్లగొండ, మనసాక్షి.:
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని మరమ్మతు పనులను జూన్ 10లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు), ఆర్‌సీఓలు, సంక్షేమ శాఖ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బడిబాట కార్యక్రమం ఏర్పాట్లు, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల వినియోగం, పాఠశాల భవనాల మరమ్మతులు, పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, అంగన్‌వాడీ కేంద్రాల సౌకర్యాలు, కేజీబీవీలలో పెండింగ్ పనులు, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ, సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులు, పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలను పూర్తిచేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల్లో మూత్రశాలలు, తాగునీటి సౌకర్యాల కల్పన, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపడుతున్న పనులు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు యూనిఫాంలను అందజేయాలని, వాటి కుట్టు పనులను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించాలని తెలిపారు.
సంక్షేమ హాస్టళ్లలో బియ్యం నిల్వలు, వంటశాలలు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్స్, తరగతి గదుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యుత్, ప్లంబింగ్ వ్యవస్థలను పూర్తిగా తనిఖీ చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. పాఠశాలల పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ప్రతి పాఠశాలలో లైబ్రరీలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని, జీరో అడ్మిషన్లు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి నమోదు సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు. జూన్ 12లోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని ఆదేశించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు ఏఐ ఆధారిత తరగతులు నిర్వహించాలని,
పాఠశాలలలోనే ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రతి విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో ప్రావీణ్యం సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి దశరథ. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర ర్రావు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పిడి శేఖర్ రెడ్డి. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు









