కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు..!
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చేతులెత్తేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ లు విమర్శించారు.

కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు..!
(చింతపల్లి – వెంకట్, మనసాక్షి)
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చేతులెత్తేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ లు విమర్శించారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని సాయిశివ గార్డెన్ లో జరిగిన దేవరకొండ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ…..
ముఖ్యమంత్రి,మంత్రులు ప్రజా సమస్యలను పరిష్కరించడంపై కాకుండా స్కామ్‌లు, వాటాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, పట్టభద్రుల ఓటరు నమోదు ఆవశ్యకతపై మాట్లాడారు. కృష్ణా నది నుంచి ఇప్పటివరకు తెలంగాణకు అందుబాటులో ఉన్న నీటిలో 18 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి ఉంటే రాష్ట్రంలోని చెరువులు నిండి, ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కె ఎల్ ఐ ద్వారా డిండి ప్రాజెక్టును రెండుసార్లు నింపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. గతంలో నీటి వనరుల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులకు సాగునీరు అందించామని తెలిపారు. ప్రస్తుతం నీటి నిర్వహణలో వైఫల్యం కారణంగా తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్‌కు నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వద్ద లొంగిపోయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును మరింత బలోపేతం చేసుకోవాలంటే పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పట్టభద్రుల హక్కుల పరిరక్షణలో ఓటరు నమోదు కీలకమని, అర్హులైన వారెవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ సమావేశంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి , ఏనుగుల రాకేష్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిల్యా నాయక్ వడ్త్యా రమేష్ నాయక్ వివిధ మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు , కార్యకర్తలు వివిధ గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










