పిల్లలు పుట్టడం లేదంటూ భార్యకు వేధింపులు.. అనుమానాస్పద మృతి
పిల్లలు పుట్టడం లేదంటూ భార్యను వేధిస్తూ, ఆమె మృతికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పిల్లలు పుట్టడం లేదంటూ భార్యకు వేధింపులు.. అనుమానాస్పద మృతి
కరీంనగర్ బ్యూరో – నరేష్, మనసాక్షి:
పిల్లలు పుట్టడం లేదంటూ భార్యను వేధిస్తూ, ఆమె మృతికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్‌రెడ్డి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఇలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన నాతరి చంద్రయ్య కుమార్తె స్వరూపకు సుమారు 18 ఏళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన దావు చంద్రకుమార్‌తో వివాహమైంది. పెళ్లయిన తర్వాత సుమారు 12 ఏళ్ల వరకు సంతానం కలగకపోవడంతో చంద్రకుమార్ భార్యను వేధించేవాడని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం కుమార్తె జన్మించినప్పటికీ మగ సంతానం కావాలంటూ వేధింపులు కొనసాగించాడని ఆరోపించారు. మద్యం సేవించి భార్యను కొట్టడంతోపాటు, ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధించేవాడని, మరో వివాహం చేసుకుంటానని బెదిరించేవాడని ఫిర్యాదులో తెలిపారు. ఘటన జరిగిన రోజు రాత్రి కూడా స్వరూపను వేధిస్తూ, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తీసుకెళ్లాలని, లేదంటే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు.
Also Read : District Collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన రైతుల ధాన్యానికి మద్దతు ధర చెల్లించాల్సిందే..!
మరుసటి రోజు ఉదయం స్వరూప మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు చేరుకున్నారు. ఆమె మెడ కింది భాగంలో గీరిన, కమిలిన గాయాలు కనిపించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సంఘటన జరిగిన రాత్రి సుమారు 12 గంటల సమయంలో చంద్రకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారని, తన కుమార్తెను భర్తే గొంతు నులిమి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు.









