ఆలూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అక్కడికక్కడే ఒకరు మృతి..!
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్ర శివారులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు.

ఆలూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అక్కడికక్కడే ఒకరు మృతి..!
ఆర్మూర్, మన సాక్షి
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్ర శివారులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు–ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆలూర్ నుంచి దేగాం–నందిపేట్ రహదారి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు, నందిపేట్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొన్నాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు ధరించి ఉన్న అతని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.
సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.









