Hyderabad : రూ.2 లక్షల అప్పుల కోసం ల్యాప్టాప్ చోరీలు.. మాజీ అమెజాన్ ఉద్యోగి అరెస్ట్..!
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ల్యాప్టాప్ చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.

Hyderabad : రూ.2 లక్షల అప్పుల కోసం ల్యాప్టాప్ చోరీలు.. మాజీ అమెజాన్ ఉద్యోగి అరెస్ట్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ల్యాప్టాప్ చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడు చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన 23 ఏళ్ల నాగిశెట్టి జశ్వంత్. అతను గతంలో అమెజాన్లో ఉద్యోగిగా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో నిందితుడికి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ఉండటంతో సుమారు రూ.2 లక్షల మేర అప్పులు అయ్యాయని, వాటిని తీర్చేందుకు గత ఆరు నెలలుగా రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ల్యాప్టాప్ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ నెల 22న ఖాజాగూడలోని ఎంఆర్ గ్రాండ్ హాస్టల్లో మూడు ల్యాప్టాప్లు చోరీకి గురికావడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
డీసీపీ ఆదేశాల మేరకు, ఏసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి జూన్ 26న నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో గత ఐదు నెలల్లో మొత్తం ఎనిమిది ల్యాప్టాప్లను నిందితుడు దొంగిలించినట్లు తేలింది. వాటిలో నాలుగు ల్యాప్టాప్లను క్యాషిఫై యాప్ ద్వారా విక్రయించగా, మిగిలిన రూ.2.5 లక్షల విలువైన నాలుగు ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై ఇప్పటివరకు మొత్తం ఐదు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వాటిలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నాలుగు, మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది.నిందితుడిని శనివారం న్యాయస్థానం ఎదుట హాజరు పరచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించి కేసును త్వరితగతిన ఛేదించిన రాయదుర్గం క్రైమ్ విభాగం సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.









