రైతులు ఈ పంటలు సాగు చేస్తే నాలుగేళ్ళ పాటు ఏటా ఎకరానికి రూ.4200 ప్రభుత్వ సహాయం.. 30 ఏళ్ల పాటు స్థిరాదాయం..!
రైతులు వరి సాగుకు స్వస్తి పలికి, రాబోయే రోజుల్లో లాభసాటిగా ఉండే పామాయిల్ తోటల వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.

రైతులు ఈ పంటలు సాగు చేస్తే నాలుగేళ్ళ పాటు ఏటా ఎకరానికి రూ.4200 ప్రభుత్వ సహాయం.. 30 ఏళ్ల పాటు స్థిరాదాయం..!
సూర్యాపేట, మనసాక్షి
రైతులు వరి సాగుకు స్వస్తి పలికి, రాబోయే రోజుల్లో లాభసాటిగా ఉండే పామాయిల్ తోటల వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట మండలంలో కాసరాబాద్ లోని ఆయిల్ పామ్ పంటలను కలెక్టర్ పరిశీలించి పామాయిల్ సాగు చేస్తున్న మల్లేష్ అనే రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పామాయిల్ తోటలు రైతులకు సిరుల పంటగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులకు మేలు చేసే పంటల్లో పామాయిల్ అత్యుత్తమమైనదని కలెక్టర్ పేర్కొన్నారు. వరి సాగుతో పోలిస్తే ఇందులో పెట్టుబడి భారం చాలా తక్కువని తెలిపారు. ఒక్కసారి ఈ తోటను నాటితే నాలుగు సంవత్సరాల నుంచి మొదలై ఏకంగా 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన, అధిక ఆదాయం లభిస్తుందని ఆయన వివరించారు.
పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు 70 శాతం నుండి 90 శాతం వరకు భారీ సబ్సిడీని అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అద్భుతమైన సదుపాయాలను, రాయితీలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తోట నాటిన మొదటి నాలుగు సంవత్సరాల వరకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4,200 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
పామాయిల్ తోటల్లో మొదటి మూడు సంవత్సరాల వరకు మొక్కలు పెరిగే లోపు రైతులు వివిధ అంతర పంటలను సాగు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందులో కోకో, వక్క మిరియాలు, తమలపాకు వంటి వివిధ రకాల అంతర పంటలను బహుళ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. మూడున్నర ఏళ్ల తర్వాత పామాయిల్ ద్వారా ప్రధాన ఆదాయం రావడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య ,జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య, వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ , వ్యవసాయ విస్తరణ అధికారి ముత్తయ్య,సూర్యాపేట డివిజన్ ఉద్యాన అధికారి కట్ట. స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారులు యారాల సుధాకర్ రెడ్డి, రంగు ముత్యం రాజు, వంగూరి అనిల్,ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ నిమ్మ గోపికృష్ణ , ఫీల్డ్ ఆఫీసర్ భవిష్య ,రైతులు వెదిరే లక్ష్మీ నరసింహారెడ్డి,కిషన్ రెడ్డి, ఆశబోయిన మల్లేష్ ,బొమ్మగాని సైదులు ,రామకృష్ణ ,తన్నీరు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.









