Miryalaguda : నాణ్యతలేని సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..!
నాణ్యతలేని సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్ డిమాండ్ చేశారు.

Miryalaguda : నాణ్యతలేని సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నాణ్యతలేని సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, పద్మశెట్టి కోటేశ్వరరావు, గంగుల భిక్షం, అంజిబాబు, 10వ వార్డు వార్డు ఇంచార్జ్ ఇనుగంటి జ్యోతి తిరుపతి నాయుడు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
మిర్యాలగూడ పట్టణంలో టి యు ఎఫ్ ఐ డి సి నిధుల కింద మాజీ ఎమ్మెల్యే శ్రీ భాస్కర్ రావు కృషితో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు, కాంక్రీట్ డ్రైన్లు, వరద కాలువల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను టెండర్ ద్వారా ఎస్ కే ఆర్ కాంట్రాక్టర్ స్వీకరించగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు పనులు పూర్తయ్యాయన్నారు.
మిగిలిన పనుల కోసం గత సంవత్సరం సుమారు రూ.16 కోట్ల వ్యయంతో మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల్లో సీసీ రోడ్లు, కాంక్రీట్ డ్రైన్లు మరియు వరద కాలువల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగింది. అయితే ఈ పనులను సబ్ కాంట్రాక్టర్లకు కమిషన్ ప్రాతిపదికన అప్పగించడంతో ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించిందని ఆరోపించారు.
మిర్యాలగూడ 10వ వార్డు రవీంద్రనగర్‌లో సుమారు రూ.30 లక్షల వ్యయంతో వారం రోజుల క్రితం నిర్మించిన సీసీ డ్రైన్ రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికే చాలా వరకు కూలిపోగా, నిన్న సాయంత్రం కురిసిన స్వల్ప వర్షానికే మిగిలిన భాగం కూడా పూర్తిగా దెబ్బతిన్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాణ్యతలేని నిర్మాణాల కారణంగా మున్సిపాలిటీకి సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేసి విజిలెన్స్ విచారణకు సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల్లో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించాలని, ఇకనైనా పనులను సక్రమంగా నిర్వహించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.










