మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ దే

మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ దే

ఉప ఎన్నిక కోసం అవిశ్రాంతంగా శ్రమించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు

టీఆర్ఎస్ కు ఓటేసిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, మనసాక్షి : ఢిల్లీ నేతల దురాగతానికి, అహంకారానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నిక పోరులో గెలుపు టీఆర్‌ఎస్‌ దే అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుపై ఓటేసిన ఓటర్ మహాశయులకు భాస్కర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా, ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం గత నెల రోజుల నుంచి అవిశ్రాంతంగా అకుంఠిత దీక్షతో టీఆర్ఎస్ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ఓటర్లను చైతన్యపరిచిన పార్టీ శ్రేణులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రూ.18,000 కోట్ల కాంట్రాక్టర్ కోసం బీజేపీ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఉప ఎన్నికలో ఓటమి తప్పదని భాస్కర్ రావు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల వద్ద తాకట్టు పెట్టిన రాజ్ గోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని, అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. మునుగోడును దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ తరఫున అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతీ ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

పార్టీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వెళ్లి మునుగోడులో స్థానికంగా ఉంటూ టీఆర్ఎస్ సుపరిపాలనను అక్కడి ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇంఛార్జీలకు, వారితో వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకారం అందించిన సోషల్ మీడియా వారియర్లకు సైతం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు భాస్కర్ రావు తెలిపారు.