Nalgonda : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన.. జనగణనలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొనాలి..!
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన–2027 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Nalgonda : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన.. జనగణనలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొనాలి..!
నల్లగొండ, మన సాక్షి :
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన–2027 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక ఆధారమని, భవిష్యత్ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల ప్రణాళిక రూపకల్పనలో జనగణన గణాంకాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన సమగ్ర సమాచారం జనగణన ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా జనగణన స్వీయ గణన ప్రక్రియలో పాల్గొని కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రజలు కూడా ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులుగా గుర్తింపు కార్డులతో వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన సమాచారాన్ని అందించి జనగణన విజయవంతానికి తోడ్పడాలని కోరారు.
ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, ఆ వివరాలను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించడం జరగదని స్పష్టం చేశారు. ఎటువంటి సందేహాలు లేకుండా నిజమైన సమాచారాన్ని నమోదు చేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ప్రభుత్వ ప్రణాళికల అమలుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాగే జనగణన పేరుతో మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంటి వద్దకు వచ్చే అధికారిక ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం వివరాలు, ఓటీపీలు లేదా పాస్‌వర్డ్‌లు అడగరని తెలిపారు. అలాంటి వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు.
ప్రజలు తమ ఇంటికి సంబంధించిన వసతులు, కుటుంబ సభ్యుల సంఖ్య, విద్య, ఉపాధి, తాగునీటి సదుపాయం, గృహ పరిస్థితులు వంటి సాధారణ సమాచారాన్ని మాత్రమే వెల్లడించాలని సూచించారు.
జనగణన పేరుతో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు పంపుతూ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ వివరాలు అడిగే మోసగాళ్లను నమ్మవద్దనిహెచ్చరించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా మోసపూరిత కాల్స్ ఎదురైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని, సరైన సమాచారం అందించడం ద్వారా సమగ్ర గణాంకాలు సిద్ధమై దేశ అభివృద్ధికి దోహదపడుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతికుటుంబం బాధ్యతాయుతంగా సహకరించిజనగణన–2027ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎన్యూమరేటర్లు ఏం.డి ఉస్మాన్, మారోజు మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.









