రంగన్న రచన : ప్రజల గొంతుక పుస్తకావిష్కరణ

రంగన్న రచన : ప్రజల గొంతుక పుస్తకావిష్కరణ
చరిత్రను వక్రీకరించేందుకు కుట్ర
గవర్నర్ హోదాలో రాజ్యాంగ ఉల్లంఘన
ప్రజల జీవితాలు చదివిన వాడే నిజమైన నాయకుడు
మిర్యాలగూడ , మనసాక్షి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాసిన ప్రజల గొంతుక పుస్తకావిష్కరణ నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని విఘ్నేశ్వర ఎస్టేట్ లో మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో బిజెపి పాత్ర ఏమాత్రం లేనప్పటికీ తామే పోరాటంలో పాల్గొన్నామంటూ చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిందని ఆనాడు కమ్యూనిస్టులు విరోచతమైన పోరాటాలు చేశారని ఆ పోరాటంలో ఎంతో మంది ముస్లింలు ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. కానీ బిజెపి ప్రభుత్వం హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు.
ALSO READ : బాలాపూర్ లడ్డుకు రెట్టింపు ధర పలికిన అల్వాల్ గణపతి లడ్డు
ఎన్నికల నాటికి రజాకార్ల ఫైల్ సినిమా తీసి ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించబోతున్నారని చెప్పారు. దేశానికి వామపక్షాల భావజాలం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. రాజ్యాంగమైన పదవిలో ఉంటూ గవర్నర్ రాజ్ భవన్ ను పార్టీ వేదికగా మార్చడం సరైంది కాదన్నారు. గవర్నర్ హోదాలో ఉండి రాజకీయాలు ప్రస్తావించడం రాజ్యాంగ ఉల్లంఘననేనని ఉద్ఘటించారు.
ప్రజలను ఆలోచింపజేసే పుస్తకమే ప్రజల గొంతుక అని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా జీవితాన్ని రంగన్న గడుపుతున్నాడని ఆయన శాసనసభ్యుడుగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలను ప్రజలు గుర్తించుకోవాలన్నారు. పుస్తకాలు భౌతిక శక్తిగా మారుస్తాయని అందులో భాగమే ప్రజల గొంతుక పుస్తకమని అన్నారు. రంగన్న రాజకీయ జీవితం అంతా ప్రజల కోసమే పని చేస్తున్నారని, దశాబ్దాల పాటు జెండా ఎజెండా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని, అలాంటి నాయకులు ప్రస్తుతం చాలా తక్కువగా ఉంటారని చెప్పారు.
ALSO READ : ఆత్మహత్యలు కావు.. హత్యలు – ఏపూరి సోమన్న – latest news
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ శాసనసభలో అనేక ప్రజా సమస్యలను లేవ నెత్తి వాటి పరిష్కారం కోసం పనిచేశారన్నారు. 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించారన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రాజకీయ వ్యాసాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. వాటిని పుస్తక రూపంలో ప్రజల్లోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ తాను 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గంలో ఇప్పటికీ రంగన్ననే ఎమ్మెల్యేగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకుండా నిరంతరం ప్రజాసేవ కోసం రంగన్న పనిచేస్తున్నారన్నారు. మతతత్వ పార్టీలను ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్ తో కలిసి రావడం శుభ పరిణామం అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే పొత్తులో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో జూలకంటి రంగారెడ్డిని గెలిపిస్తానని హామీ ఇచ్చారు. ఆనాడు శాసనసభలో లేవనెత్తిన అంశాలను పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో శుభ పరిణామం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సిడి రవికుమార్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, మానవ హక్కుల వేదిక నాయకులు సుబ్బారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు బంటు వెంకటేశ్వర్లు , కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి, సిపిఎం రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, సిపిఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ మువ్వ రామారావు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు జె రాజు, ఎం సిపి ఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, మైనార్టీ నాయకులు మహమ్మద్ భాషా, సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.