రాకాసి అలలు@20 ఇయర్స్..!
రాకాసి అలలు@20 ఇయర్స్..!
ప్రపంచాన్ని వణికించిన సునామీ భీభత్సానికి 20 ఏళ్ళు
అప్పటిదాకా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భీకర రూపం దాల్చింది. అలలే యమ పాశాలై ప్రాణాలను ఎత్తుకుపోయాయి. ఆకాస్మాత్తుగా విరుచుకుపడ్డ అలలు…ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేశాయి. ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాలు ఆత్మీయులను కోల్పోయి…ఆస్తులు నీట మునిగి…నిజంగానే కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆ రాకాసి అలల సునామీ వచ్చి…20 ఏళ్ళు అవుతున్నా…ఇంకా చాలా మంది జీవితాల్లో ఆ వణుకు పోలేదు. 2004 ఒక్కసారిగా విరుచుకుపడి…ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసిన సునామీపై ప్రత్యేక కథనం.
అది 2004 డిసెంబర్ 26…ఉదయం పది కూడా కాలేదు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ సునామీ రాకాసి అలలు…ప్రజల వెన్నులో వణుకుపుట్టించాయి. 9 గంటల 45 నిమిషాలకు మొదలై 12 గంటల 30 నిమిషాల వరకు సముద్రం ఐదుసార్లు తన పంజా విసిరింది. సునామీ వచ్చే ముందు సముద్రం అరకిలోమీటరు వరకు వెనక్కు వెళ్ళింది. హిందూ మహా సముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకు మధ్య…దక్షిణ తీరంలో సునామీ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో…2,30,000 మందికి పైగా బలి తీసుకుంది.
సైంటిస్టుల పరిశోధన ప్రకారం హిందూ మహా సముద్రంలో 10 నిమిషాలకు పైగా భూమి కంపించడమే సునామీకి ప్రధాన కారణంగా తేలింది. ఒక్కో అల ఏకంగా 120 అడుగు ఎత్తు ఎగిరింది. అవి సృష్టించిన బీభత్సం తలచుకుంటే…ప్రత్యక్ష సాక్షుల గుండెల్లో ఇప్పటికీ రైళ్ళు పరిగెత్తుతున్నాయి.
ఇండోనేషియాపై సునామీ తీవ్ర ప్రభావాన్ని చూపింది. అక్కడ 1,70,000 మందికి పైనే ప్రాణాలు పోయాయని నివేదికలు చెబుతున్నాయి. సుమత్ర దీవుల్లో…ఎటు చూసినా మృత్యు శకలాలు మాత్రమే దర్శనమిచ్చాయి.
మన దేశంలో సునామీ విధ్వంసం సృష్టించిన నష్టం కూడా తక్కువేమి కాదు. తమిళనాడులో 8009 మంది… అండమాన్ నికోబార్ దీవుల్లో 3513 మంది…..పాండిచ్చేరిలో 599 మంది….కేరళలో 177ఆంధ్రప్రదేశ్‌లో 107 మంది చనిపోయారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. ఇంకా లెక్కకు రాని మనుషులెందరో…సునామీ అలల భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నోరులేని జీవులు సముద్రపు నీటిలో మృత్యువాత పడ్డాయి.
ఎన్నో ఎత్తైన భవనాలు…క్షణాల వ్యవధిలోనే నెలమట్టమయ్యాయి. దేవాలయాలు, స్టేడియాలు, వాణిజ్య సముదాయాలు, ఇళ్ళు, పొలాలు మొత్తం నీటి మట్టమయ్యాయి. ఇండోనేషియా, ఇండియా, శ్రీలంక…ఇలా చాలా దేశాల్లో కలిపి 25 లక్షల మందికిపైనే నిలువ నీడ లేక నిరాశ్రయులుగా మిగిలారు. ఇప్పటికీ 50 వేల మందికిపైగా ఆచుకీ లేకుండా పోయారని ప్రత్యేక నివేదికలో తేలింది.
థాయిలాండ్‌లో టూరిస్టులు కూడా…ఎక్కువ సంఖ్యలో సునామీ అలల్లో ప్రాణాలు కోల్పోయారు. సునామీ దెబ్బకు శ్రీలంక ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రజలు చాలా మంది నీట మునిగి…అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తమిళనాడులోని నాగపట్టణంలో ఆరు వేల మందికి పైగా చనిపోయినట్టు నివేదికలు తెలిపాయి. సునామీ వచ్చి 20 ఏళ్ళు గడుస్తున్నా…ఆ భయానక రాకాసి అలల తాకిడి సృష్టించిన మరణ భీభత్సం ఇంకా వెంటాడుతూనే ఉంది. అప్పటి వరకు సునామీ గురించి వాతావరణ శాఖ ప్రపంచ వ్యాప్తంగా…ముందస్తు హెచ్చరికలు చేసేది కాదు. దీంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది.
Reporting :
Mahipal Reddy, Hyderabad
MOST READ :
Gold Price : నిన్న తగ్గింది.. మళ్లీ పెరిగింది.. నేడు బంగారం ధరలు..!
Rythu Bharosa : రైతు భరోసా కు సీలింగ్.. మీరు అర్హులేనా, లేటెస్ట్ అప్డేట్..!
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!
Cm RevanthReddy : సంక్రాంతికి వస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి..!
New Scheme : తెలంగాణ మహిళలకు అదిరిపోయే పథకం.. ప్రతి మహిళకు 10 లక్షలు.. వివరాలు ఇవే..!










