అమ్మకానికి… ఆర్పీ ఉద్యోగాలు…?

మదనపల్లె మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో ఆర్పీ(రిసోర్స్‌పర్సన్‌) ఉద్యోగాలు కావాలా....? అర్హతలు లేకున్నా పర్వాలేదు. జస్ట్‌...మీరు పనిచేయాలనుకుంటున్న వార్డు కౌన్సిలర్, మెప్మా సీఎంఎం వీరిద్దరిలో ఎవరు పరిచయమున్నా చాలు..చేతిలో రూ.2లక్షల నగదు పెట్టుకుని వీరివద్దకు వెళితే నెలకు రూ.10,000తో పాటు ఆమ్యామ్యాలు వచ్చే ఆర్పీ ఉద్యోగం గ్యారంటీ..అయితే త్వరపడాలి.

By : Vamshi, madanapalle

అమ్మకానికి… ఆర్పీ ఉద్యోగాలు…?

  • మెప్మాలో అక్రమవసూళ్లకు తెర
  • ఇంటిదొంగలకు మళ్లీ అవకాశం
  • ఎన్నికల నోటిఫికేషన్‌లోపు భర్తీకి సన్నాహాలు
  • చేతులు మారుతున్న లక్షల రూపాయలు

మదనపల్లె టౌన్, మన సాక్షి :

మదనపల్లె మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో ఆర్పీ(రిసోర్స్‌పర్సన్‌) ఉద్యోగాలు కావాలా….? అర్హతలు లేకున్నా పర్వాలేదు. జస్ట్‌…మీరు పనిచేయాలనుకుంటున్న వార్డు కౌన్సిలర్, మెప్మా సీఎంఎం వీరిద్దరిలో ఎవరు పరిచయమున్నా చాలు..చేతిలో రూ.2లక్షల నగదు పెట్టుకుని వీరివద్దకు వెళితే నెలకు రూ.10,000తో పాటు ఆమ్యామ్యాలు వచ్చే ఆర్పీ ఉద్యోగం గ్యారంటీ..అయితే త్వరపడాలి.

ఆలస్యం చేస్తే ఆశాభంగం. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు భర్తీ ప్రక్రియ పూర్తయిపోవాలి. ఇదీ మదనపల్లె మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో జరుగుతున్న తీరు. మదనపల్లె మున్సిపాలిటీలోని 69 సమాఖ్యలకు ప్రస్తుతం 48 మంది ఆర్పీలు ఉన్నారు. 21 ఆర్పీ ఖాళీలు కొన్నేళ్లుగా అలానే ఉన్నాయి. 14 సమాఖ్యల్లో ఓబీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించి, వారితో పని కానిచ్చేస్తున్నారు. మిగిలిన వాటిల్లో గతంలో పనిచేసిన ఆర్పీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఆదేశాలతో విధుల నుంచి తొలగించారు.

ALSO READ : వైఎస్సార్ ను పంచే విప్పి కొడతా అని మాట్లాడిన మాటలు గుర్తుకున్నాయి… రోజాపై షర్మిల ఘాటు విమర్శలు..!

మెప్మాలో పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఒక్కసారిగా దోపిడీకి తెరలేపారు. గతంలో తొలగించిన ఆర్పీలు సైతం రాజకీయనాయకుల పలుకుబడితో లక్షలు ఖర్చుచేసి ఉద్యోగాలు పొందేందుకు పావులు కదిపారు. రెండురోజుల్లో ఇంటిదొంగలు తిరిగి ఆర్పీలుగా కొనసాగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

వీరికి లాగిన్‌ ఇచ్చి పనిచేయించేందుకు ప్రక్రియ పూర్తయినట్లు తెలిసింది. ఇక మిగిలిన ఆర్పీ ఉద్యోగాలకు ఒకో ఉద్యోగానికి రూ.2–3లక్షల మధ్య వసూళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే నియామకాలు జరపలేమని, గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్లుగా ఐదేళ్లు ఖాళీగా ఉన్న ఆర్పీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ALSO READ : BREAKING : తొలి అభ్యర్థిని ప్రకటించిన షర్మిల.. బ్రిటిష్ వాళ్లను అల్లూరి తరిమి కొట్టినట్లు ఇప్పుడు నియంతలను తరిమికొట్టండి

ఇదిలాఉంటే…గతంలో సంఘాల డబ్బులు రూ.5లక్షలకు పైగానే స్వాహా చేశానని, ఆమె బహిరంగంగా అంగీకరిస్తున్నా…ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై మెప్మా సీ.ఎం.ఎం. రవి వివరణ ఇస్తూ… ఆర్పీ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎవరైనా మెప్మాలో ఆర్పీ ఉద్యోగాలు తీసిస్తామంటే దయచేసి నమ్మవద్దని అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి గురించి తమకు సమాచారం తెలపాలని కోరారు. ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే జరుగుతాయి తప్పితే సిఫారసులపై జరగవన్నారు.

ALSO READ : ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.5లక్షల సహాయం..!