Rythu Bandhu : రైతుబంధు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రైతుబంధు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకాన్ని 2018 నుంచి అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్ లో ఒక విడత ఎకరానికి 5000 రూపాయల చొప్పున, యాసంగి సీజన్ లో ఎకరానికి 5000 రూపాయలు చొప్పున రెండవ విడత నిధులు విడుదల చేస్తుంది.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రైతుల ఖాతాలలో నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల నూతన సచివాలయం ప్రారంభం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైతు బంధు పథకం పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి వానకాలం సీజన్ ప్రారంభమయ్యాక రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈసారి వానాకాలం సీజన్ కు ముందే జూన్ మొదటి వారంలోనే రైతుబంధు పథకం అందజేయాలని నిర్ణయించారు. జూన్ మొదటి వారంలో రైతుల ఖాతాలలోకి రైతుబంధు సహాయం పడేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలో 59. 26 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. వానా కాలం సీజన్ లో ఒక కోటి 40 లక్షల ఎకరాల్లో పంట సాగు అంచనా తో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
దాంతోపాటు మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు.. పత్తి, కంది సాగును ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. వివిధ రకాల పంటల సాగుకు మొత్తం 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని తెలిపారు. రైతులకు విత్తనాలు కూడా ముందస్తుగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.










