Karimnagar : గంజాయి కేసులో అక్రమంగా ఇరికించెందుకు కానిస్టేబుల్ కుట్ర.. తానే ఇరుక్కొని అరెస్ట్..!
భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Karimnagar : గంజాయి కేసులో అక్రమంగా ఇరికించెందుకు కానిస్టేబుల్ కుట్ర.. తానే ఇరుక్కొని అరెస్ట్..!
కరీంనగర్ , మనసాక్షి :
తాను వేసిన ఉచ్చు లో తానే ఇరుక్కున్నాడు ఓ కానిస్టేబుల్. గంజాయి కేసులో ఒకరిని ఇరికించాలని చూసిన ఆ కానిస్టేబుల్ తానే అరెస్ట్త అయ్యాడు. భూ గాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు.
ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు.
ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









