Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండవ్యవసాయం

District collector : సన్నధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేరువేరు కేంద్రాలా.. బోనస్ ఇచ్చేది ఎలా..!

District collector : సన్నధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేరువేరు కేంద్రాలా.. బోనస్ ఇచ్చేది ఎలా..!

నల్లగొండ, మన సాక్షి.

2024- 25 ఖరీఫ్ ధాన్యం సేకరణ పై శుక్రవారం కలెక్టర్ నారాయణ రెడ్డి మండల స్థాయి బృందాలతో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పోలీస్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టుల వద్ద తనకిని కట్టుదిట్టం చేయాలన్నారు. జిల్లాలో దాన్యం తీసుకువెళ్లే వాహనాలకు ప్రత్యేకంగా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, ఇతర రాష్ట్రాల నుండి ఎట్టి పరిస్థితులలో ధాన్యం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో అమ్మడానికి వీలులేదని, ఈ విషయంపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని పునరుద్ఘాటించారు.

ఈ సంవత్సరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడం, నల్గొండ జిల్లాలో అత్యధిక సామర్థ్యం ఉన్న రైస్ మిల్లులు ఉండడం,ఎక్కువ సంఖ్యలో మిల్లులు ఉండడం , గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 20,000 ఎకరాలు అదనంగా వరి పండించడం జరిగిందని,దీనితో పాటు ప్రభుత్వం సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటించడం వంటి కారణాలవల్ల ఈ సంవత్సరం రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట మార్కెట్ కు రానుందని, ఈ అన్ని కారణాల వలన జిల్లాలో ఎక్కువ ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

అందువల్ల జిల్లా నుంచి మొదలుకొని మండల స్థాయి బృందాల వరకు పూర్తిగా ధాన్యం కొనుగోలు పైన దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలని ,ఎలాంటి పొరపాట్లు చేయకూడదని అన్నారు. ఈ విడత ధాన్యం కొనుగోలులో అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తున్నామని, సమన్వయంతో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మండలాలలో మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీవో అధ్యక్షతన ధాన్యం కొనుగోలును నిర్వహించాలని, సన్నధాన్యానికి, దొడ్డు ధాన్యానికి వేరువేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

అలాగే సన్నధాన్యంలో ప్రత్యేకించి ఆయా రకాలను కూడా వేరువేరుగా కొనాలని, మిల్లులకు పంపించేటప్పుడు రవాణా సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ట్రక్ సీట్ పై స్పష్టంగా సన్నధాన్యం, దొడ్డు ధాన్యం అని రాయాలని, సన్నధాన్యం బస్తాలను రెడ్ కలర్ సుత్లి తో కుట్టాలని, దొడ్డు రకం బస్తాలను గ్రీన్ కలర్ సుత్లి తో కుట్టాలని, అంతేకాక సన్నధాన్యం బస్తాలపై” ఎస్” అని రెడ్డింకుతో రాయాలని సూచించారు. మిల్లర్లు సైతం సన్నధాన్యం మిల్లింగ్ వేరుగా ,దొడ్డు ధాన్యం మిల్లింగ్ వేరుగా ఉంచాలని, ఈ విషయాలపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, లేనట్లయితే దొడ్డు ధాన్యం, సన్న ధాన్యం కలిసేందుకు అవకాశం ఉందని అన్నారు.

ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రెండు తేమ కొలిచే యంత్రాలు, నాలుగు తూకం యంత్రాలు, 40 మంది హమాలీలు, 30 టార్పాలిన్లు, తాగునీరు, రైతులు కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏరోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజే మిల్లులకు పంపించాలని, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఎక్కువ లారీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు . ధాన్యం కొనుగోలు సందర్భంగా గన్ని బ్యాగులకు ఎలాంటి కొరతలేదని, ప్రతి కొనుగోలు కేంద్రానికి 50 శాతం గన్ని బ్యాగులను ముందే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నారు.

మండల స్థాయిలోని ఎంఎస్ఓ, ఎంపీ ఓ ,ఏపీ ఓ, సబ్ ఇన్స్పెక్టర్, తహసిల్దార్, మార్కెటింగ్ సెక్రటరీ, ఎంపీడీవోలు అందరూ వారి విధులలో 50 శాతం ధాన్యం కొనుగోలు పైన కేటాయించాలన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రాకున్నా కచ్చితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ,వచ్చేవారం నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలన్నారు. జిల్లా నుండి కాకుండా ఆంధ్ర లేదా ఇతర రాష్ట్రాల నుండి రైతులు లేదా వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు వరి ధాన్యం పండించిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, పోలీసు అధికారులు బయటి దాన్యం రాకుండా చెక్పోస్టుల వద్ద భద్రతను కట్టుదితం చేయడంతో పాటు, అంతర్గతంగా సైతం ధాన్యానికి సంబంధించి పూర్తి నిఘ ఉంచాలన్నారు.

దాన్యం కొనుగోలులో మండల స్థాయి బృందాల పాత్ర ముఖ్యమని అన్నారు. అలాగే డివిజన్ స్థాయిలో ఆర్డిఓ ,డిఎస్పి, వ్యవసాయ శాఖ ఏడిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ,ఏవైనా ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులు వస్తే తక్షణమే అక్కడికి వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వ్యతిరేకత,వ్యతిరేక వార్తలు వంటివి రాకుండా చూసుకోవాలన్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, అలాగే ఈ విడతన ప్రభుత్వం సన్నధాన్యాన్ని ప్రత్యేకంగా కొంటున్నదని, 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ -ఏ రకానికి 2320 రూపాయలు సాధారణ రకానికి 2300 రూపాయలు పొందేందుకు రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రచారం చేయాలన్నారు.

అలాగే ధాన్యం కోత, తూర్పార పట్టడం, శుభ్రం చేయడం పై కూడా సరైన విధంగా రైతులలో అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ధాన్యాన్ని అమ్మినప్పుడే రైతులు కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ,ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ అదే రోజే సెంటర్ ఇన్చార్జికి ఇవ్వాలన్నారు. లేనట్లయితే ధాన్యం అమ్మిన డబ్బులు వారి అకౌంట్లో జమ అయ్యేందుకు సమయం పడుతుందని, అలాకాకుండా ముందే ఇచ్చినట్లయితే తక్షణమే డబ్బులను వారి అకౌంట్లో వేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

ధాన్యం లోడ్ చేసిన వెంటనే ట్రక్ సీట్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే దాన్యం ను నియంత్రించేందుకుగాను వాడపల్లి, విజయపురి వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, షిఫ్ట్ పద్ధతిలో పోలీసులను విధులకు నియమించడం జరిగిందని, పోలీసు అధికారులు ధాన్యం సేకరణలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో సైతం స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే లారీలను వెంటనే సీజ్ చేయాలని, ఎక్కడైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ముందే గుర్తించి వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు .

అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, నల్గొండ ఇన్చార్జ్ ఆర్డిఓ శ్రీదేవి ,డిఎస్పీలు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, కొంతమంది ఎంపీడీవోలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కేంద్రం నుండి పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ,డిఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, జిల్లా సహకార శాఖ అధికారి పథ్యా నాయక్ ,తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు