విద్యార్థులను కొరియర్లుగా వాడుకోవడం నేరం

విద్యార్థులను కొరియర్లుగా వాడుకోవడం నేరం

సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్

హుజూర్‌నగర్, మనసాక్షి : నేరస్తులు, అసాంఘిక శక్తులు తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఇటీవల కాలంలో విద్యార్థులను కొరియర్లుగా వాడుకోవడం పరిపాటిగా మారిందని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

అభం, శుభం తెలియని అమాయకులైన బాల, బాలికలను తాము చేసే నేరాలకు వారదులుగా వాడుకోవడం చట్ట ప్రకారం కఠిన శిక్షార్హమైనదని ఆయన చెప్పారు. తాము చేసే నేరాలను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో వారిని తప్పుదారి పట్టించి, తద్వారా గండం గట్టెక్కి, తమ పని తాము చక్క పెట్టుకోవడానికి అన్యం, పుణ్యం ఎరుగని అమాయక బాల,బాలికలను తమకు సహాయకులుగా వాడుకోవడం అత్యంత నేరమన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక మైనారిటీ గురుకుల కళాశాలలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బాలికలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయిని వాడటం, రవాణా చేయడం, అమ్మడం, చట్ట ప్రకారం నేరమని అట్టి గంజాయిని రవాణా చేసే నేపథ్యంలో పోలీసుల కంటపడకుండా, వారికి అనుమానం కలగకుండా, చిన్నారి బాల,బాలికలను, విద్యార్థినీ, విద్యార్థులను కొరియర్లుగా ఏర్పాటు చేసుకొని గంజాయి రవాణా చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయనీ అందువల్ల అటువంటి అసాంఘిక శక్తుల బారిన పడకుండా బాల బాలికలను అప్రమత్తం చేయడానికి తమ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలలో కళాశాలల లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి కొత్త వారెవరైనా బాల బాలికలతో పరిచయాలు పెంచుకోవడానికి కానీ, చనువుగా మెడలడం గానీ చేస్తూ ఉంటే పోలీస్ వారికి తగిన సమాచారం ఇచ్చి బాల బాలికను కట్టడి చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చల్లా కృష్ణయ్య, కుక్కడపు సైదులు, ఎం.ఎస్. రాఘవరావు, మీసాల అంజయ్య, పచ్చిపాల గురుమూర్తి తదితరులు వివిధ చట్టాల గురించి విద్యార్థినీ, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రెహనా బేగం, సువర్ణ, హస్మ, న్యాయశాఖ సిబ్బంది శ్యామ్ కుమార్, సలీం, పారా లీగల్ వాలంటీర్స్ కాసిం, సాయమ్మ, అమల, లత తదితరులు పాల్గొన్నారు.