Sunburn : వడదెబ్బ లక్షణాలు.. తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ..!
రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు

వడదెబ్బ లక్షణాలు.. తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ..!
రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు
చౌటుప్పల్. మన సాక్షి.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భానుడు భగ్గున మండిపోతున్నాడు… ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఎండ తీవ్రత ఉమ్మడి జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రానున్న రోజులో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో బయటికి వెళ్తే.. కరోనా సోకుతుందో లేదో తెలియదు కానీ వడదెబ్బతో ప్రాణాలు పోవడం ఖాయమనిపిస్తుంది.
ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే శరీరం అదుపుతప్పుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. ప్రతి ఒక్కరూ తరచూ కుండలోని చల్లని నీళ్లను తాగుతూ శరీరాన్ని సమతూలంగా ఉంచుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. అయితే ఇంట్లో కూర్చున్న వారికి కూడా వడదెబ్బ తగులుతుందని ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలని వైద్యులు తెలుపుతున్నారు.
ఇంట్లో ఎక్కువ వేడి, ఉష్ణోగ్రత ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4°ఫారెన్ హీట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే… జ్వరం వస్తుంది. వ్యక్తి శరీర ఉష్ణోగ్రతలు 104,106 డిగ్రీల ఫారెన్ హీట్ కు పడిపోతే వడదెబ్బకు గురైనట్లు గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకొని వైద్యులను సంప్రదించాలని వైద్యులు తెలుపుతున్నారు.
– వడదెబ్బ వల్ల శరీరంలో కలిగే మార్పులు :
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల గుండెలయ తప్పుతుంది.శరీరంలో శక్తినంత కోల్పోయిన భావన కలుగుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఇటువంటి పరిస్థితిని తట్టుకోలేక ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. శరీరంపై చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడీవేగం పెరుగుతుంది.శరీరం అదుపుతప్పి మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల వ్యక్తి గందరగోళానికి గురవుతారు.
కళ్ళు మసక బారిపోతాయి ఇటువంటి సమయంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే వడదెబ్బ సోకిన వ్యక్తి కోమాలోకి జారుకుంటారు. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడ దెబ్బకు గురి అయ్యే అవకాశం ఉంది. శరీరంలోని రక్తకణాలు, కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి. వడదెబ్బ అనేది అనుకోకుండా సంభవించే ప్రమాదం ఇది కూడా ఒక యాక్సిడెంట్ లాంటిది.
– వడదెబ్బ ఎవరిపై ఎక్కువ ప్రభావం :
చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణీలు, బాలింతలు,50 సంవత్సరాలు పైబడిన వయసుగలవారికి వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, స్థూలకాయలు, మద్యం ఎక్కువగా సేవించేవారు, అతిగా ఔషధాలు తీసుకునేవారు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో ఎక్కువసేపు ఎండలో పనిచేసే కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, రోడ్లపై చిరు వ్యాపారాలు చేసేవారు, వాహనాలు నడిపేవారు, పోలీసులు, రైతులు, వ్యవసాయ కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
– వడదెబ్బ లక్షణాలు :
వడదెబ్బ తగిలిన వ్యక్తికి తీవ్రమైన తలనొప్పి లేదా తల తిరిగినట్లు అనిపిస్తుంది .శరీరంపై చెమట పట్టడం ఆగిపోతుంది. శరీరం పొడిగా లేదా ఎర్రగా మారిపోతుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారెన్ హీట్ కంటే ఎక్కువగా ఉండి జ్వరం వస్తుంది. కండరాలు బలహీనమవుతాయి. తిమ్మిరి ఏర్పడుతూ వికారం వాంతులు వస్తాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. శ్వాస పెంచుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. వడదెబ్బ తగిలిన వ్యక్తి గందరగోళం అయోమయానికి గురవుతూ వింతగా ప్రవర్తిస్తారు.
వ్యక్తి శరీరంలో నీటి శాతం లోపించి శరీరం అదుపుతపుతుంది. వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే తరచూ వాంతులు, విరేచనాలు ఏర్పడతాయి. దాహం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ సోకిన వ్యక్తికి పెదవులు ఎండిపోవడం, మూత్రం పసుపురంగులో రావడంతో పాటు మంట రావడం ఇటువంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
– వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
ప్రతి ఒక్కరూ తప్పనిసరి బయటికి వెళ్లేటప్పుడు గొడుగును తీసుకువెళ్లాలి. రోజుకు ప్రతి వ్యక్తి 5 నుంచి 6 లీటర్ల వరకు నీరు తాగాలి. సమయానికి తగిన ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. తగు మోతాదులో ఉప్పు కలిపిన ద్రవాన్ని తాగాలి. వదులైన కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి .నూనె పదార్థాల వాడకం తగ్గించడమే కాక నెయ్యితో చేసిన వంటకాలు తినకపోవడం మంచిది . ఫ్రిజ్ లోని నీళ్లు, శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ సేవించాలి.
ఎండ తీవ్రతకు కళ్ళు పొడిబారి పోకుండా కంటికి సన్ గ్లాసెస్ ధరించాలి. నీళ్ల బాటిల్, ఓఆర్ఎస్ ను బయటికి వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లాలి. వృద్ధులు, పిల్లలు ఎండకు బయటికి వెళ్ళకపోవటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లు,మజ్జిగ ఎక్కువగా సేవించాలి :
– డాక్టర్ కాటమ్ రాజు. ప్రభుత్వ వైద్య నిపుణులు, చౌటుప్పల్.
వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశాన్ని తీసుకువెళ్లి శరీరాన్ని చల్లబరిచేందుకు తడిబట్టతో తుడవాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తి అరగంటలో కోల్కోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా వైద్యుడు దగ్గరికి నేరుగా తీసుకువెళ్లాలి. వడదెబ్బ కలిగిన వ్యక్తికి శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవచ్చు లేదా మూర్చ రావచ్చు.
గుండె జబ్బులు ఉన్నవారికి వడదెబ్బ ప్రమాదం ఎక్కువ కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రేకుల ఇండ్లు, భవనాల పై అంతస్తులో నివసించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్కహాల్ సేవించడం వల్ల అది శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది. ప్రమాదాన్ని కొని తెచ్చిపెడుతుంది. కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువ సేవించడం మంచిది. సాధ్యామైనంతవరకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే బయటికి వెళ్లాలి.