Suryapet : సూర్యాపేట జిల్లా పొనుగోడు లో ఘోర విద్యుత్ ప్రమాదం.. కుటుంబ సభ్యుల ఆందోళన..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో విద్యుత్ మరమ్మతుల సమయంలో జరిగిన ప్రమాదం ఓ ప్రైవేటు వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.

Suryapet : సూర్యాపేట జిల్లా పొనుగోడు లో ఘోర విద్యుత్ ప్రమాదం.. కుటుంబ సభ్యుల ఆందోళన..!
గరిడేపల్లి మన సాక్షి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో విద్యుత్ మరమ్మతుల సమయంలో జరిగిన ప్రమాదం ఓ ప్రైవేటు వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, విద్యుత్ లైన్‌కు సంబంధించిన పనుల్లో ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకోకుండానే పనులు చేపట్టారని తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, లైన్‌మెన్ కారింగుల అంజయ్యతో కలిసి నేరేడుచర్ల మండలంలోని దర్శించర్ల గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ నాగిరెడ్డి వద్ద పనులు నిర్వహిస్తున్న సమయంలో, పని పూర్తయిన అనంతరం ఒక విద్యుత్ స్తంభం ఎక్కాలని పంగా సురేష్ ను ప్రైవేటు వ్యక్తిని పంపించారని ఆరోపించారు. ఆ సమయంలో లైన్‌కు విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో అతడు తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడని పేర్కొన్నారు.
తీవ్ర గాయాలపాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఒక చేయి, ఒక కాలును తొలగించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
లైన్‌మెన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు గరిడేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళన అనంతరం విద్యుత్ శాఖ డీఈల ఆధ్వర్యంలో, స్థానిక పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున రూ.8 లక్షలు, కాంట్రాక్టర్ నాగిరెడ్డి తరఫున రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.10.50 లక్షలు బాధితుడికి అందజేయాలని పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరినట్లు సమాచారం.
అయితే, ప్రమాదానికి సంబంధించిన నిర్లక్ష్యంపై అధికారిక విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు మరోసారి కోరారు.









