Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది

రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది

నల్లగొండలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ , మన సాక్షి :
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది.పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమం లో జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,రవీంద్ర కుమార్,నోముల భగత్,ఎన్.భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ యం.సైది రెడ్డి,
జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్,ఎస్.పి.అపూర్వ రావు,అదనపు కలెక్టర్ లు హేమంత్ కేశవ్ పాటిల్, జె.శ్రీనివాస్,రిటైర్డ్ ఐ ఏ.ఎస్.అధికారి చొల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు,ప్రజల నుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ జాతీయ సమైక్యతా దినోత్సవం ప్రాముఖ్యత,అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి పై సందేశం ఇచ్చారు.
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందేశం : 
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్య్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు…

సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, తెలంగాణ ప్రాంతం భారత్‌ యూనియన్‌లో విలీనమై నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణా అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రానికై పోరాడుతూనే ఉన్నారు.

బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్‌ యాక్టు సంస్థానాల విషయంలో స్వతంత్రంగా ఉండటం లేదా భారత దేశంలో లేదా పాకిస్తాన్‌ లో విలీనం కావడానికి అవకాశం ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారత దేశంలో విలీనం అయ్యాయి. కానీ జునాఘడ్‌, కాశ్మీర్‌, హైదరాబాద్‌ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాదు సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషల మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉన్నది.
హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించారు.

కానీ సంస్థానంలో భూస్వాములు, జమీందార్లు, జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను రకరకాలుగా వేదించారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం చెల్లించాల్సి వచ్చింది. 85 శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టిచాకిరి, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకార్ల దమనకాండ కొనసాగింది.

కనీస హక్కుల కోసం, దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలపై దాడులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాలలో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది. గ్రంథాలయ ఉద్యమానికి ఆది పురుషుడు కొమర రాజు వెంకట లక్ష్మణ రావు , 1901లో మునగాల రాజానాయని వెంకటరంగారావు సహాయంతో హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని నెలకొల్పారు. ఇదే తెలంగాణలో స్థాపించిన ప్రథమ గ్రంథాలయం. తరువాత 1904లో లక్ష్మణరావు కృషి ఫలితంగా హన్మకొండలో రాజరాజ నరేంద్ర భాష నిలయం, 1905లో ఆంగ్ల సంవర్ధిని నిలయం సికింద్రాబాద్‌లో వెలిశాయి. ప్రతి ఏట గ్రంథాలయ మహాసభలు జరుపుతూ తెలుగు ప్రజలను ఏకం చేశారు.
సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ పత్రిక’, షబ్నవీసు వెంకటరామ నరసింహారావు సంపాదకత్వంలో స్థాపించిన ‘నీలగిరి పత్రిక’ బద్దిరాజు సీతారామచంద్రరావు సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు పత్రిక’ ఇంకా ఇతర పత్రికలు ప్రజలను చైతన్యపరచటానికి గొప్ప కృషి చేశాయి.
రెండో ఆంధ్రమహాసభ దేవరకొండలో 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పులిజాల వెంకటరంగా రావు, ఆహ్వాన సంఘం కార్యదర్శిగా పగిడిమర్రి ఎల్లయ్య, అధ్యక్షుడిగా బూర్గుల రామకృష్ణారావు వ్యవహరించారు.
ఆంధ్రజన కేంద్ర సంఘం ‘నిజాం ఆంధ్ర మహాసభ’ గా మారి తెలంగాణా-స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించింది. 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జనకేంద్ర సభ ఆంధ్రమహా సభగా ప్రకటించు కోవడం జరిగింది. 1930 నుండి 1946 వరకు 13 ఆంధ్ర మహాసభలు జరిగి తెలంగాణా జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాయి. 1944లో భువనగిరిలో జరిగిన 11వ సభలో రావి నారాయణరెడ్డి అధ్యక్షులుగా ఎన్నికైనారు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా మగ్దూం మోహియోద్దీన్‌ , రాజ్‌ బహదూర్‌గౌర్‌ , రామానందతీర్ద , మాడపాటి హనుమంత రావు , బూర్గుల రామకృష్ణా రావు , కొండా వెంకట రంగారెడ్డి , రావి నారాయణ రెడ్డి , మందుగుల నర్సింగ రావు , వందేమాతరం రామ చందర్‌ రావు , దేవులపల్లి రామానుజరావు , కె.ఎల్‌. మహేంద్ర , డా. మర్రి చెన్నారెడ్డి ప్రజలను చైతన్యపరిచారు. ఆనాడు జరిగిన ప్రజా పోరాటాలలో అప్పటి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్లగొండ జిల్లా నుండి భీంరెడ్డి నర్సింహా రెడ్డి , బొమ్మగాని ధర్మభిక్షమ్‌ , ఆరుట్ల రామచంద్రారెడ్డి , శ్రీ బద్దం ఎల్లారెడ్డి , జిట్ట రామచంద్రారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి , సుశీల దేవి , సుద్దాల హనుమంతు , బొందుగుల నారాయణ రెడ్డి , కుర్రారం రాంరెడ్డి గారు, గడ్డమీది రామయ్య , గుత్తా సీతారాంరెడ్డి , శ్రీ కొండవీటి గురునాథ రెడ్డి , శ్రీ ఎర్రబోతు రాంరెడ్డి , శ్రీ కోదాటి నారాయణరావు ఇంకా ఎందరో త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు.

రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన శ్రీ దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైనది. ఇందులో నల్లగొండ కమ్యూనిస్టుల పాత్ర కీలకమైనది.
ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైన చాకలి ఐలమ్మ , మల్లు స్వరాజ్యం , ఆరుట్ల కమలా దేవి కీలక పాత్ర పోషించారు.


నల్లగొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన ‘‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడుకో.. నైజాం సర్కారోడో…’’ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది.
భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి. అంతే కాకుండా వీటన్నింటికి పరాకాష్టగా 1948 ఆగష్టు 27న జరిగిన బైరాన్‌పల్లి సంఘటన మరవరానిది. ఆ తరువాత 21 రోజులలోనే హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో చేరింది.
మరోవైపు హైదరాబాద్‌ సంస్థానం భారతదేశం భూభాగం మధ్యలో ఉండటం భవిష్యత్‌ లో సమస్యలకు దారి తీస్తుంది అని భారత ప్రభుత్వం భావించింది.
మరోవైపు ప్రజలపై రజాకార్లు, జమీందార్ల దాడులు పెరిగిన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మరియు హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు.
తమ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్‌ 13న భారత సైన్యం రంగంలోకి దిగింది. దీనినే ఆపరేషన్‌ పోలో అని పిలిచారు. ఓవైపు సాయుధ పోరాటం..మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్‌లో విలీనానికి అంగీకరించాడు. 1948 సెప్టెంబరు 17 సాయంత్రం డెక్కన్‌ రేడియోలో ఇండియన్‌ యూనియన్‌లో చేరుతానని ప్రకటించారు.
నిజాం లొంగుబాటుతో హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో కలపడం జరిగింది. తదుపరి 1951లో శ్రీ యం.కె. వెళ్లోడి ఐ.సి.ఎస్‌.ను ముఖ్యమంత్రి (సివిల్‌ అడ్మినిస్ట్రేటర్‌) గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. శ్రీ వెళ్లోడి ప్రభుత్వం 1952 వరకు పరిపాలన కొనసాగించింది. తదుపరి 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగి శ్రీ బూర్గుల రామకృష్ణారావు ని ముఖ్యమంత్రిగా, శ్రీ కొండా వెంకట రంగా రెడ్డిని ఉపముఖ్యమంత్రిగా, వి.బి. రాజు, యం. చెన్నా రెడ్డి మరియు తదితరులతో మంత్రివర్గం ఏర్పడినది.

హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల కుట్రల ఫలితంగా 1953లో మద్రాసు నుండి విడిపోయి మూడు సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకొని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపటానికి చేసిన నిర్ణయాన్ని ప్రముఖ తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికి భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఆంధ్ర పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో 1969లో ప్రారంభమయిన తొలిదశ ఉద్యమంలో సుమారు 350 మంది అసువులు బాసినారు. ఆ తరువాత మలిదశ ఉద్యమాన్ని నాటి ఉద్యమ నాయకుడు నేటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో 2001లో ప్రారంభించి సుమారు 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపిస్తూ ప్రజలందరిని ఒకేతాటిపైకి తీసుకొచ్చిన ఫలితంగా జూన్‌ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అనతికాలంలోనే అధ్బుత ప్రగతిని సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది.

వ్యవసాయ రంగం : నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారధ్యములో తెలంగాణ గత దశాబ్ద కాలములో వ్యవసాయ రంగం దేశములోనే అగ్రగామిగా నిలిచింది, ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంగా అభివృద్ధి చెందడం జరిగింది. పండిరచిన ప్రతి ధాన్యం గింజను కూడా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది. తెలంగాణలోని రైతులకు వ్యవసాయ రంగానికీ అవసరమైన మేరకు విద్యుత్తును సరఫరా చేయడం జరుగుచున్నది. అందులో భాగంగా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 5 వేల 6 వందల ఎకరాలలో 30 వేల కోట్ల రూపాయలతో 4000 మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ను డిసెంబర్‌ 2024 నాటికి పూర్తి చేయుటకు పనులు శరవేగంగా జరుగుచున్నవి.

సంక్షేమ రంగం : సంక్షేమ రంగానికి దేశములోనే అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలైన రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్ధిక సహాయం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుచున్నవి.
విద్యారంగం :- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సుమారు (940) గురుకులాలను నెలకొల్పడం జరిగింది. ఇందులో దాదాపు 6 లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిదే.

పరిశ్రమలు, ఐటీ రంగం :
పరిశ్రమలకు సింగిల్‌ విండో పద్ధతి ద్వారా అనుమతులు ఇవ్వబడుతున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుంది. కొత్త ఐ.టి. విధానం ద్వారా హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి రంగం, జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించబడుచున్నది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రములో కూడా నూతన ఐ.టి. టవర్‌ నిర్మాణము పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
నీటిపారుదల రంగం :` తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరుగుతుంది మరియు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి, AMR-SLBC, ఉదయసముద్రం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మరియు డిరడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పురోగతిలో ఉన్నవి.
తెలంగాణ రాష్ట్రములో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయము, అమరవీరుల స్థూపము మరియు ప్రపంచంలోనే ఎత్తైన 125 అడుగుల డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించి ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా హైదరాబాద్‌లో కొమరం భీం ఆదివాసీ భవన్‌, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవన్‌లను ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోవడం హర్షణీయం. తద్వారా తెలంగాణ రాష్ట్రము పురోగతి పథములో నిరంతరము పయనించేందుకు కొత్త బాటలు రూపొందించుకున్నాం.
రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందాం… తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి అందేలా ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా మంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ , సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ శ అపూర్వ రావు , జిల్లా అధికార యంత్రాంగం పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.

మరిన్ని వార్తలు