రైతుల బతుకులను ఆగం చేసే ప్రాజెక్టులు మాకు వద్దు..!
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, న్యాయమైన పరిహారం ఇవ్వలేని పక్షంలో భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలో భారీ రాస్తారోకో నిర్వహించారు.

రైతుల బతుకులను ఆగం చేసే ప్రాజెక్టులు మాకు వద్దు..!
- డిండి ఎత్తిపోతల పథకంపై రైతుల ఆందోళన..!
- ఎకరాకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి
చింతపల్లి, మన సాక్షి :
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, న్యాయమైన పరిహారం ఇవ్వలేని పక్షంలో భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై రైతులు బైఠాయించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టు డీఈకి, చింతపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను ప్రాజెక్టు కోసం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతే తమ కుటుంబాల జీవనాధారం దెబ్బతింటుందని తెలిపారు. ప్రస్తుత భూముల విలువలకు అనుగుణంగా ఎకరాకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
న్యాయమైన పరిహారం అందించకుండా భూసేకరణ చేపట్టడం సరికాదని రైతులు అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను తక్షణమే పరిగణనలోకి తీసుకుని పరిహారంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయమైన పరిహారం అందించే వరకు భూసేకరణను ముందుకు సాగనివ్వబోమని, అవసరమైతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రైతుల రాస్తారోకోతో హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నట్వ గిరిధర్, ఎల్లంకి అశోక్, కొలుకులపల్లి కొండల్, ఆకుల శ్రీనివాస్, బై కానీ రాములు, వెంకట్‌రెడ్డి అనిల్, భాస్కర్, వీరయ్య, లింగం, అశోక్ తదితర రైతులు పాల్గొన్నారు.









