సూర్యాపేట జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో దాడి, వ్యక్తి మృతి
పాత కక్షల నేపథ్యంలో దాడి, వ్యక్తి మృతి
మునగాల ఫిబ్రవరి18 మనసాక్షి
పాత కక్ష నేపథ్యంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. మునగాల సిఐ పి. ఆంజనేయులు కథనం ప్రకారం.. నేలమర్రి గ్రామానికి చెందిన బచ్చలకూర మదార్ (52), అదే గ్రామానికి చెందిన బచ్చలకూర సంజీవ మధ్య గతంలో చోటుచేసుకున్న చిన్నచిన్న గొడవల కారణంగా మనస్పర్థలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో గురువారం ఇదే అదనుగా భావించిన సంజీవ వెనుక నుంచి మదార్ పై కర్రతో దాడికి దిగాడు. దీంతో అతడి తల, ముఖం, చేతులపై బలమైన గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కొడుకు నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ. ఆంజనేయులు తెలిపారు









