Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లారాజకీయం

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఉర్కొండ పర్యటనకు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లు..!

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై నెలలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల కేంద్రంలోని అత్యంత ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఉర్కొండ పర్యటనకు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లు..!

ఊర్కొండ, మనసాక్షి :

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై నెలలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల కేంద్రంలోని అత్యంత ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి ఉర్కొండలో విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.

ఆలయ పండితులు ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను కలెక్టర్, ఎస్పీకి అందజేశారు. అధికారులతో కలిసి పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలను సందర్శించి, ముఖ్యమంత్రి ఆలయ దర్శనం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఆలయ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం ఉర్కొండపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానాన్ని సందర్శించి, ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ప్రతిపాదించే హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు,హెలికాప్టర్ దిగిన అనంతరం కాన్వాయ్ రాకపోకలకు అవసరమైన రహదారుల పరిస్థితి, బ్యారికేడింగ్,పోలీసు బందోబస్తు,అగ్నిమాపక, అంబులెన్స్ తదితర అత్యవసర సేవల ఏర్పాట్లపై అధికారులతో సమగ్రంగా చర్చించి తగిన సూచనలు చేశారు.

పర్యటనలో భాగంగా ఉర్కొండ మండలంలో ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి అధికారుల కార్యాలయ సముదాయం నిర్మాణానికి, నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాలను కూడా జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా అన్ని మౌలిక వసతులతో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

స్థల సేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించేందుకుఅవసరమైన ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధంచేయాలని సూచించారు. అనంతరం ఉర్కొండ రైతు వేదికలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జిల్లాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని, ప్రతి శాఖ అధికారి పూర్తి బాధ్యతతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని, అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండలంలోని 16 గ్రామపంచాయతీల్లో పరిశుభ్రత, పచ్చదనం రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రధాన రహదారులు, గ్రామ వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు,విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, ఆలయ పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

మొక్కలు నాటడం, రహదారుల వెంట చెత్త తొలగించడం, కాలువల శుభ్రత, తాగునీటి వసతుల మెరుగుదల వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.గ్రామీణ ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య,పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

వానాకాలం సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు యూరియా, విత్తనాల కొరత తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం మండలంలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, విత్తనాల సరఫరా పరిస్థితిపై మండల వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పోలీసు అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఆలయ పరిసరాలు, హెలిప్యాడ్, ప్రయాణ మార్గాలు, సభా ప్రాంగణం తదితర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవ సహాయం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, జిల్లా ఏడి సర్వేయర్ గిరిధర్, ఉర్కొండ తహసీల్దార్ యూసుఫ్ అలీ, ఎంపీడీవో, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు